- సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, గ్రూప్–1 ఆందోళనలపై అప్రమత్తంగా ఉన్నం: డీజీపీ
- వరుస ఘటనలపై నివేదికలు సిద్ధం
- గ్రూప్–1 పరీక్షల విషయంలో హైకోర్ట్ ఆదేశాలు అమలు
- పరీక్షలకు పటిష్ట బందోబస్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు ఎవరైనా అడ్డొస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. గ్రూప్-–1 విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేస్తున్నామని తెలిపారు. సోమవారం జరగనున్న పరీక్ష కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరైనా ఆందోళనలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ధ్వంసం కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు.
సోమవారం జరుగనున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. గోషామహల్ పోలీస్ స్టేడియంలో సంస్మరణ దినం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర గ్రేహౌండ్స్ పోలీస్ కానిస్టేబుల్ సహా దేశవ్యాప్తంగా 240 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. పోలీసు అమరుల సంస్మరణలో భాగంగా ఈ నెల 31 వరకు ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామీణ, పట్టణాల్లోని రోడ్లకు పోలీస్ అమరుల పేర్లు పెట్టేలా స్థానిక సంస్థలకు ప్రతిపాదించాలని అన్నారు.
అప్రమత్తంగా ఉన్నాం..
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి, గ్రూప్-–1 పరీక్షల విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా లా ఎన్ ఫోర్స్ మెంట్ చేస్తున్నామని డీజీపీ జితేందర్ తెలిపారు. శనివారం చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితులపై పూర్తి సమాచారం సేకరించినట్టు వెల్లడించారు. చత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్ర బార్డర్ లోకి ప్రవేశిస్తున్న మావోయిస్టులను సమర్థవంతంగా అడ్డుకుంటున్నామని తెలిపారు. మావోయిస్టు సుజాత తమ అదుపులో లేదని డీజీపీ స్పష్టం చేశారు.