పోలీసులు మాల వేసుకుంటే తప్పేంటి..? డీజీపీ ఆఫీస్ ను ముట్టడించిన అయ్యప్ప స్వాములు

పోలీసులు మాల వేసుకుంటే తప్పేంటి..? డీజీపీ ఆఫీస్ ను ముట్టడించిన అయ్యప్ప స్వాములు
  • కంచన్​బాగ్​ ఎస్సైకి ఇచ్చిన మెమో వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • ఆఫీసులోకి చొచ్చుకువెళ్లేందుకు యత్నం.. ఉద్రిక్తత

బషీర్​బాగ్/ఓల్డ్​సిటీ, వెలుగు: అయ్యప్ప స్వాములు, బీజేవైఎం చేపట్టిన డీజీపీ కార్యాలయం ముట్టడి గురువారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కంచబాగ్​ఎస్సై కృష్ణకాంత్​కు  మెమో ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం తొలుత మాదన్నపేట​హనుమాన్​ దేవాలయం నుంచి లక్డికాపూల్​లోని డీసీపీ కార్యాలయం వరకు నిరసన ర్యాలీని  నిర్వహించారు. 

ర్యాలీగా వచ్చిన వారిని పోలీసులు అడ్డుకోగా, ఇరువురి మధ్య తోపులాట, వాగ్వివాదం జరిగింది. డీజీపీ కార్యాలయానికి దూసుకెళ్లడానికి యత్నించిన స్వాములను పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యప్ప దీక్షలో ఉన్న పోలీస్ ఉద్యోగుల పట్ల తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాన్ని స్వాములు ఖండించారు. అయ్యప్ప మాలదారి అయిన కాంచన్ బాగ్ ఎస్సై కృష్ణకాంత్​పై మెమో జారీ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మాలదారుడిపై మెమో ఎందుకు? ఎలా? ఇస్తారని ప్రశ్నించారు.

 హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండం దారుణమన్నారు. ఎస్సై అయ్యప్ప మాల వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు సెలవు ఎందుకు పెట్టుకోవాలని, సెలవు పెట్టి దీక్షలో ఉంటే రెండు నెలలు జీతాలు కట్టిస్తారా? అని నిలదీశారు. ఎస్సైకు ఇచ్చిన మెమోను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అనంతరం కొంత మంది స్వాములను మెమోరాండం అందజేయడానికి పోలీసులు అనుమతించారు. అరెస్ట్ చేసిన స్వాములను , బీజెవైఎం నాయకులను వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించి , సాయంత్రం విడుదల విడుదల చేశారు.