అవినీతికి పాల్పడితే సీరియస్ యాక్షన్ : డీజీపీ శివధర్

అవినీతికి పాల్పడితే సీరియస్ యాక్షన్ : డీజీపీ శివధర్
  • కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే ఆపై అధికారులే బాధ్యులు: డీజీపీ శివధర్ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ సిబ్బందిని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. కింది స్థాయి సిబ్బంది తప్పులు చేస్తే వారి పైస్థాయి అధికారులు కూడా బాధ్యులేనన్నారు. అవినీతికి పాల్పడే సిబ్బందిపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు నిర్వహించనున్న ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రాం’పై గురువారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్ల సీపీలు, ఎస్పీలతో చర్చించారు. సమీక్ష సందర్భంగా డీజీపీ మాట్లాడారు. ‘‘పోలీసులు తమ వ్యవహార శైలి మార్చుకోవాలి. మెదక్ జిల్లాలోని టేక్మాల్‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఘటన రిపీట్ కావొద్దు. మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో స్వచ్ఛంద సంస్థ సహకారంతో ‘సేఫ్ విలేజ్ ప్రోగ్రాం’ నిర్వహిస్తున్నం. పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలి’’అని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ(లా అండ్ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మహేశ్‌‌‌‌‌‌‌‌ భగవత్‌‌‌‌‌‌‌‌, సీఐడీ చీఫ్ చారు సిన్హా తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశించారు. మూడు దఫాలుగా ఎన్నికలు జరుగనున్నందున పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌ నిర్వహించింది. ఈ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా పోలీస్ అధికారులు సహా సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘‘పోలీసులు, భద్రతా బలగాలు బందోబస్తు నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వర్తించాలి. సమస్యాత్మక ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’అని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.