హద్దులు తేల్చక.. కబ్జాలు..అటకెక్కిన గొలుసుకట్టు చెరువుల డీజీపీఎస్ సర్వే

హద్దులు తేల్చక.. కబ్జాలు..అటకెక్కిన గొలుసుకట్టు చెరువుల డీజీపీఎస్ సర్వే
  • కనిపించని లేక్ ప్రొటెక్షన్ కమిటీ యాక్టివిటీస్
  • అడ్డులేని ఆక్రమణలు
  • హద్దుల వద్ద ఫెన్సింగ్ చర్యలు కరువు
  • అటకెక్కిన డీజీపీఎస్ సర్వే

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లా కేంద్రంలోని చారిత్రక గొలుసుకట్టు చెరువుల రక్షణ డీజీపీఎస్(డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) సర్వేను చేపట్టేందుకు రూపొందించిన ప్రతిపాదనలు అటకెక్కాయి. జిల్లాలోని మొత్తం 12 గొలుసు కట్టు చెరువులకు గాను మూడింటికి మాత్రమే సర్వే పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. చెరువుల విస్తీర్ణాలను డీజీపీఎస్​తో సర్వేతో హద్దులు నిర్ధారించి కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటామని అధికారులు మొదట్లో వెల్లడిం చారు. రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు అప్పటి కలెక్టర్ సంయుక్తంగా సర్వే చేపట్టారు.

కానీ సర్వే మూడు చెరువులకు మాత్రమే పరిమితమైంది. మిగతా తొమ్మిది చెరువుల సర్వే చేపట్టకపోవడం కబ్జాదారులకు వరంగా మారుతోంది. సాంకేతికంగా చెరువు హద్దులు గుర్తించకపోవ డంతో శిఖం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ భూముల ఆక్రమణలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ కబ్జాలతో గొలుసుకట్టు చెరువుల రూపురేఖలే మారుతున్నాయి.

రెవెన్యూ రికార్డుల ప్రకారం లెక్కలు ఇలా... 

ప్రస్తుతం అధికారుల వద్ద ఉన్న చెరువు భూముల రికార్డులకు, వాస్తవ పరిస్థితులకు భారీ తేడా ఉంటోంది. అడ్డగోలు ఆక్రమణలు, కబ్జాలతో ఈ చెరువు భూముల విస్తీర్ణం 50 శాతానికి పైగా కనుమరుగైందని తెలుస్తోంది. బంగల్​పేట చెరువు 210.32 ఎకరాలు, మోతి తలాబ్ చెరువు 132.06 ఎకరాలు, ఖజానా చెరువు 98.22, కొత్త చెరువు 33.11, మంజులాపూర్ చిన్న చెరువు 81.34, జాపూర్ కురన్నపేట చెరువు 76.18,  సీతా సాగర్ గొల్లపేట చెరువు 48.11, ఇబ్రహీం చెరువు 76.18, కంచరోని చెరువు 74.19, ధర్మసాగర్ చెరువు 65.10, రామ్ సాగర్ చెరువు 37.23 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారుల వద్ద ఉన్న రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ భారీ స్థాయిలో ఆక్రమణలు జరగడంతో ఈ చెరువుల విస్తీర్ణం పూర్తిగా తగ్గింది. డీజీపీఎస్ సర్వే జరిగితే మొత్తం భూముల విస్తీర్ణానికి సంబంధించిన వివరాలు, ఆక్రమణల లెక్కలు తేలే అవకాశం ఉంటుంది.

ఎఫెక్ట్​ చూపని లేక్ ప్రొటెక్షన్ కమిటీ.. 

చెరువు భూములను ఆక్రమణల నుంచి కాపాడి, వాటికి రక్షణ కల్పించేందుకు కొంతకాలం క్రితం ఏర్పాటు చేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటైంది. జిల్లా అడిషనల్ కలెక్టర్, పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ కమిటీ భూముల రక్షణపై పెద్దగా ప్రభావం చూపడం లేదని విమర్శలున్నాయి. హద్దుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు.

ఒకటి, రెండు సందర్భాల్లో స్థానికుల ఫిర్యాదు మేరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీ  చెరువు భూములను సందర్శించి సంరక్షణ ప్రయత్నాలు చేసినప్పటికీ, పూర్తిస్థాయిలో ఆక్రమణలను నివారించలేకపోతోందని వాదనలున్నాయి. లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇప్పటికైనా క్రియాశీలక పాత్ర పోషించి చెరువు భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.