హైదరాబాద్, వెలుగు: ప్రపంచస్థాయి క్విజ్ పోటీల్లో సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన టీచర్ ఉస్తాల ధనుశ్ రెడ్డి విజేతగా నిలిచారు. బెంగళూరుకు చెందిన 'గ్రే కాప్స్', 'టీచర్స్ ట్రైబ్' సంస్థలు నిర్వహించిన ‘6వ వరల్డ్ టీచర్స్ క్విజ్ 2026’లో ఆయన టాపర్ గా నిలిచారు. మార్చి 1 నుంచి 28 వరకు ఆన్‌లైన్ వేదికగా జరిగిన పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా టీచర్లు పాల్గొన్నారు.
తుది పోరుకు నలుగురే ఎంపికయ్యారు. క్విజ్ మాస్టర్ రేష్మీ పుటాడో నిర్వహించిన ఫైనల్స్‌లో ధనుశ్ రెడ్డి 500 మార్కులు సాధించి విజేతగా నిలిచారు. రూ.20 వేల నగదు బహుమతి గెలుచుకున్నారు. కోదాడలోని తేజ విద్యాలయంలో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న ధనుశ్ రెడ్డి విజయం పట్ల ప్రిన్సిపల్, ఆయన తల్లి రమాసోమిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
