
- ధరణిలో నమోదు కాలేదని గుర్తించిన కమిటీ
- వేలాది ఎకరాలు రికార్డు కాకపోవడంపై విస్మయం
- కబ్జాకు గురయ్యాయా? పట్టాలుగా మార్చారా? అని అనుమానాలు
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, టీఎస్‌ఐఐసీ అధికారులతో ధరణి కమిటీ సమావేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ఇండస్ట్రియల్ఇన్ఫ్రాస్ట్రక్చర్కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)కు చెందిన వేలాది ఎకరాల భూములు మాయమయ్యాయి. టీఎస్‌ఐఐసీ దగ్గర మొత్తం 60 వేల ఎకరాలు ఉండగా, అందులో 25 వేల ఎకరాలు మాత్రమే ధరణిలో నమోదైనట్టు ధరణి కమిటీ గుర్తించింది. మిగిలిన 35 వేల ఎకరాలు ఏమయ్యాయనే దానిపై ఆరా తీస్తోంది. ఈ భూముల లెక్కలు తీసి, పోర్టల్‌లో అప్డేట్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సీసీఎల్ఏ నవీన్మిట్టల్నేతృత్వంలోని ధరణి కమిటీ బుధవారం సెక్రటేరియెట్ లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ, టీఎస్‌ఐఐసీ అధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ధరణిలోని లోపాలు, ఇతర అంశాలపై చర్చించింది. టీఎస్ఐఐసీకి చెందిన వేలాది ఎకరాలు ధరణి పోర్టల్ లో నమోదు కాకపోవడంపై కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. ఆ భూములు కబ్జాకు గురయ్యాయా? లేదంటే పట్టాలుగా మార్చారా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. ఆయా భూముల వివరాలు సేకరించాలని సంబంధిత అధికారులకు సూచించింది.
ధరణితో ఐజీఆర్ఎస్ లింక్..
ధరణి పోర్టల్‌లో జరిగే అగ్రికల్చర్భూముల రిజిస్ట్రేషన్లకు.. స్టాంప్స్అండ్రిజిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో సబ్రిజిస్ట్రార్ఆఫీసుల్లో జరిగే భూలావాదేవీలకు సంబంధం లేకపోవడంతో పెద్ద ఎత్తున గోల్మాల్జరిగినట్టు ధరణి కమిటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ ను స్టాంప్స్అండ్రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఐజీఆర్ఎస్వెబ్సైట్తో లింకప్చేసేలా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని అభిప్రాయపడింది. భూలావాదేవీలకు సంబంధించి అటు సబ్ రిజిస్ట్రార్, ఇటు తహసీల్దార్ ఆఫీస్‌కు సంబంధం ఉండేలా చూడాలని పేర్కొంది.
ధరణి, ఐజీఆర్ఎస్అనుసంధానమైతే సమస్యలు తగ్గుతాయని గుర్తించింది. రెండింటికీ ఒక్కటే ఈసీ రిఫ్లెక్ట్అయ్యేలా ప్లాన్‌చేయాలని ప్రభుత్వానికి సూచించనుంది. అగ్రికల్చర్ భూముల రిజిస్ట్రేషన్ డిప్యూటీ తహసీల్దార్ లెవల్ లో జరగాలని,మ్యుటేషన్, పాస్‌బుక్ ఇష్యూ అథారిటీ ఎమ్మార్వోకు ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది.
నిషేధిత జాబితాలో 11 లక్షల సర్వే నంబర్లు..
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం.. ఇంటికి వెళ్లి కూడా రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు ఉంది. కానీ ధరణి చట్టంలో అలాంటి వెసులుబాటు లేదు. అయినప్పటికీ ఇండ్లకు వెళ్లి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ధరణి కమిటీ గుర్తించింది. దీనిపై ప్రభుత్వానికి సిఫార్సు చేసి, చట్ట సవరణలో ఈ అంశాన్ని సూచించాలని నిర్ణయించింది.
దాదాపు 11లక్షల సర్వే నెంబర్లు ఐజీఆర్ఎస్వెబ్పోర్టల్ లోనినిషేధిత జాబితాలో ఉన్నట్టు కమిటీ తెలుసుకుంది. భూసేకరణకు సంబంధించి ఇచ్చిన జీవోలు పూర్తి స్థాయిలో లేవని గుర్తించింది. ఒక్క సబ్ సర్వే నంబర్ నిషేధిత జాబితాలో ఉంటే, ఆ మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో ఉంచడంతో యజమానులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించింది. ఈ విషయంలో స్టాంప్స్అండ్రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. సమావేశంలో రేమండ్‌పీటర్, లచ్చిరెడ్డి, మధుసూదన్, కోదండరెడ్డి పాల్గొన్నారు.