తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం... పట్టాలు తప్పిన డీజిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు..

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం... పట్టాలు తప్పిన డీజిల్ ట్యాంకర్ గూడ్స్ రైలు..

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం జరిగింది.. తిరువల్లూరులో డీజిల్ ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మంటలు అన్ని వ్యాగన్లకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అన్ని వ్యాగన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ట్రాక్ సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. డీజిల్ ట్యాంకర్లతో అరక్కోణం నుంచి చెన్నై వెళ్తుండగా పెరియాకుప్పం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. 

ఓడరేవు నుంచి డీజిల్ తో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగాయి. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఘటనాస్థలిలో దట్టమైన పొగ అలుముకుంది. రైలులో ఇంధనం ఉండటంతో మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

మంటలు ఆర్పేందుకు పదికి పైగా ఫైర్ ఇంజిన్లు మోహరించారు అధికారులు. ఈ ప్రమాదం కారణంగా అరక్కోణం మీదుగా చెన్నై సెంట్రల్ కు వచ్చే ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలిపేశారు. ఇవాళ ఉదయం 5 :50 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ వందే భారత్ రైలు, 6 గంటలకు బయలుదేరాల్సిన మైసూర్ శతాబ్ది రైళ్లను చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ లోనే నిలిచిపోయాయి.