కాళేశ్వరం కన్నా ధరణి పెద్ద స్కామ్ : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

కాళేశ్వరం కన్నా ధరణి పెద్ద స్కామ్ : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
  •      ఖానాపూర్​ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
  •     మహిళల గురించి బీఆర్ఎస్  నేతలు మాట్లాడడం హాస్యాస్పదమని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం, లిక్కర్​ స్కామ్​ కన్నా పెద్ద కుంభకోణం ధరణిలో జరిగిందని ఖానాపూర్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. ధరణి వల్ల జోడేఘాట్​లోనూ పాత భూస్వాములు వచ్చి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.  శుక్రవారం అసెంబ్లీలో ధరణిపై చర్చ సందర్భంగా మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో ప్రతాప్​ రెడ్డి కుటుంబ సభ్యులకు  రైతుబంధు పడుతుంటే.. అది వారి భూమి కాదని గత సర్కారుకు చెప్పినా క్లియర్​ చేయలేదన్నారు. 

ఆదిలాబాద్​ జిల్లాలోని భూములను ఇతర జిల్లాలకు పైడి రవీందర్​ రావు బదలాయించారని, అది తీవ్రమైన నేరమన్నారు. దానిపై విచారణ జరిపించాలన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి గత బీఆర్ఎస్​ సర్కారు మోసం చేసిందన్నారు. చాలా భూములను జాయింట్​ సర్వే చేయలేదని,ఆ పని చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడబిడ్డల గౌరవం గురించి బీఆర్ఎస్​ నేతలు  మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని, బీఆర్ఎస్​ పాలకులు గిరిజన ఆడబిడ్డలను బట్టలూడదీసి గుంజుకెళ్లలేదా అని ఫైర్​ అయ్యారు.