కాగ్ వద్దన్న కంపెనీకే ధరణి

కాగ్ వద్దన్న కంపెనీకే ధరణి
  • 2010లో ఒడిశా కోసం - ధరణి పేరిట సాఫ్ట్​వేర్​ రూపకల్పన 
  • అక్కడ ఫెయిలైన కంపెనీకే అప్పగించిన రాష్ట్ర సర్కార్
  • కంపెనీలు మారినా.. అన్నింట్లో ఒక్కరే కామన్ డైరెక్టర్
  • తహసీల్దార్ ఆఫీసుల్లో ఆపరేటర్లు ఆయన సంస్థ ఉద్యోగులే
  • ఎక్స్ పీరియన్స్ లేని సంస్థ చేతిలో రాష్ట్ర భూరికార్డులు

కరీంనగర్, వెలుగు:భూవివాదాలకు పరిష్కారం అంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఇప్పుడు అనేక సమస్యలకు కేంద్ర బిందువుగా మారింది. ధరణి పోర్టల్​లో నిక్షిప్తమై ఉన్న 70 లక్షల మందికి చెందిన కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూములు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, ఫారెస్ట్ డిపార్ట్​మెంట్లకు చెందిన మరో కోటి ఎకరాల భూముల డేటా భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కొందరికి కొత్త పాస్ బుక్స్ లో వచ్చిన సర్వే నంబర్లు, భూవిస్తీర్ణాలు ధరణి పోర్టల్ వచ్చాక గల్లంతయ్యాయి. పట్టా భూములు అనేకం ప్రొహిబిటెడ్ లిస్టులోకి వెళ్లాయి. సర్వే నంబర్లు గల్లంతయ్యాయి. సాదాబైనామా కింద పాస్ బుక్స్ పెండింగ్ లో పెట్టిన భూములపై పాత ఓనర్ల పేర్లు కనిపిస్తున్నాయి. 

..వద్దన్న కంపెనీకే ధరణి

ఇలాంటి అనేక తప్పులతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్​కు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ (ఐఎల్ఎస్ఎస్) అనే కంపెనీ రూపకల్పన చేసింది. ఇదే విషయమై 2021 డిసెంబర్ 3న ‘భూముల లెక్కలు పైలమేనా?’ అనే హెడ్డింగ్​తో వెలుగులో స్టోరీ పబ్లిష్ అయిన సంగతి తెలిసిందే. అందులోనే ఈ కంపెనీ దివాలా చరిత్రను, దాన్ని టేకోవర్ చేసిన కంపెనీ గురించి వివరాలు వెల్లడించాం. అయితే పోర్టల్ రూపకల్పనకే పరిమితమనుకున్న కంపెనీ డైరెక్టర్ గుప్పిట్లోనే నిర్వహణ కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఒడిశాలో ఎనిమిదేండ్ల కిందనే కాగ్ వద్దన్న కంపెనీనే కేసీఆర్ ప్రభుత్వం నెత్తికెక్కించుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒడిశాలో విఫలమైనా తెలంగాణలో బాధ్యతలు..

వాస్తవానికి ధరణి పోర్టల్​ను 13 ఏండ్ల కింద ఒడిశాలో భూముల రిజిస్ట్రేషన్ కోసం 2010 జనవరి 4న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రూపొందించింది. ఆ సాఫ్ట్​వేర్​కు ‌-ధరణి అని పేరు పెట్టింది. అప్పటి వరకు ఈ కంపెనీకి ఆస్తుల రిజిస్ట్రేషన్ సాఫ్ట్​వేర్ రూపకల్పనలో ఎలాంటి అనుభవం లేదు. ఇదే విషయాన్ని 2015లో రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన రిపోర్ట్​లో కాగ్ ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ డెవలప్ చేసిన ఓఆర్ఐఎస్ సాఫ్ట్​వేర్​తో పోల్చితే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అభివృద్ధి చేసిన ఈ–ధరణి అప్లికేషన్ సాఫ్ట్​వేర్ మెరుగ్గా ఏమీ లేదని తేల్చి చెప్పింది. అలాగే భూరికార్డుల భద్రత, గోప్యత విషయంలో సదరు కంపెనీ ఎలా వ్యవహరించాలో అగ్రిమెంట్​లో చేర్చకపోవడాన్ని కాగ్ తప్పుపట్టింది. ప్రాపర్టీ ఓనర్ రికార్డులు, సంతకాలు, వేలిముద్రలు, డేటాబేస్ రక్షణ ప్రధానమని, ఈ విషయంలో సదరు కంపెనీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొంది. ఇలాంటి చరిత్ర ఉన్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకే తెలంగాణ ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రికార్డుల డిజిటలైజేషన్, పోర్టల్ రూపకల్పన బాధ్యతలను 2017లో అప్పగించింది.

తప్పులు చేసిన కంపెనీ గుప్పిట్లోనే ధరణి

ధరణి అందుబాటులోకి వచ్చాక ఆ పోర్టల్ నిర్వహణను కూడా ప్రభుత్వం టెర్రాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్​లోని ఓ డైరెక్టర్​కు చెందిన కంపెనీకే అప్పగించింది. ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చే నాటికి అన్ని తహసీల్దార్, కలెక్టరేట్, సీసీఎల్పీ ఆఫీసుల్లో 600 మంది ధరణి ఆపరేటర్లు  ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీళ్లందరిని టెర్రాసెస్ కంపెనీలో మెయిన్ డైరెక్టర్​గా ఉన్న గాది శ్రీధర్ రాజుకు చెందిన ఇ సెంట్రిక్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా రిక్రూట్ చేసుకున్నారు. ప్రస్తుతం పారాడిగ్మ్ ఐటీ సొల్యూషన్స్ కంపెనీ ద్వారా జీతాలు ఇస్తున్నారు. పారాడిగ్మ్ కంపెనీలోనూ టెర్రాసిస్​లో, ఇ- సెంట్రిక్​లో డైరెక్టర్​గా ఉన్న గాది శ్రీధర్ రాజే మెయిన్ డైరెక్టర్​గా ఉండడం గమనార్హం. అంటే టెర్రాసిస్ నుంచి ఇప్పుడు ధరణిని ఆపరేట్ చేస్తున్న పారాడిగ్మ్ వరకు మారిన అన్ని కంపెనీల్లోనూ శ్రీధర్ రాజు కామన్ డైరెక్టర్​గా ఉండడం అనుమానాలకు తావిస్తోంది.

దివాలా తీసిన కంపెనీ.. 

మొదట భూరికార్డుల పోర్టల్ మెయింటనెన్స్ బాధ్యతలు చేజిక్కించుకున్న ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తొలుత ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్​మెంట్​ సిస్టమ్(ఐఎస్ఆర్ఎంఎస్) అనే పోర్టల్​లో  ఎంట్రీ చేసింది. ఇదే పోర్టల్ అనధికారికంగా అప్పట్లో ధరణిగా చెలామణి అయ్యింది. తహసీల్దా  ర్లు, ఇతర రెవెన్యూ అధికారులు ఈ పోర్టల్లో లాగిన్ అయి భూరికార్డులను ఎంట్రీ చేసి కొత్త పాస్ బుక్స్ జారీ చేశారు. వివిధ ప్రభుత్వ రంగ వెబ్ సైట్స్ ను మెయింటేన్ చేస్తున్న ఎన్ఐసీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో ఉండగా.. ఐఎల్ఎఫ్ఎస్ అనుబంధ టెర్రాసిస్ టెక్నాలజీకి రికార్డుల నిర్వహణను అప్పగించడంపై అప్పట్లో విమర్శలు వినిపించాయి. అయితే అప్పటికే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ బ్యాంకులకు సుమారు రూ.99 వేల కోట్లు ఎగ్గొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. రెండేండ్లుగా విడతలవారీగా అప్పులు చెల్లిస్తూ వచ్చిన ఈ సంస్థ.. 2021లో  టెర్రాసిస్ టెక్నాలజీలోని తన 52.26 శాతం వాటాను రూ.1,275 కోట్లకు ఫిలిప్పీన్స్ కు చెందిన ఫాల్కన్ గ్రూప్ నకు అమ్మేసింది. అలా మన భూముల డేటా విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఆర్టీఐలకు సమాధానం లేదు

ధరణి పోర్టల్ నిర్వహణపై నాలుగేండ్లుగా రాష్ట్రంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. పోర్టల్​ను ప్రభుత్వం నిర్వహిస్తుందా? లేక ప్రైవేట్ కంపెనీ నిర్వహిస్తుందా? ఏటా ఎంత ఖర్చవుతోంది? రికార్డుల భద్రతకు గ్యారంటీ ఎవరిది అనే విషయంలో సీసీఎల్ఏకు ఎన్ని ఆర్టీఐలు వేసినా సమాధానం ఇవ్వడం లేదు. ధరణి పోర్టల్​ను అంత రహస్యంగా నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా సాఫ్ట్ వేర్ కంపెనీ గురించి ప్రభుత్వ పెద్దలుగానీ, అధికారులుగానీ నోరు మెదపకపోవడంలో లోగుట్టు ఏమిటో అంతుచిక్కడం లేదు.
- గుమ్మి రాజ్ కుమార్ రెడ్డి, ధరణి సమస్యల వేదిక