జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హుజూర్ నగర్,వెలుగు: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, సీపీఐ కాంగ్రెస్ కు  సంపూర్ణ మద్దతు ఇస్తుందని, రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సీపీఐ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రాన్ని అనాథగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగమన్నారు. 

దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో డిసెంబర్ 26న భారీ బహిరంగ సభను 5 లక్షల మందితో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  కమ్యూనిస్టు నాయకులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మొయినుద్దీన్ లాంటి అనేకమంది కమ్యూనిస్టు యోధుల పోరాటాల ఫలితంగా ప్రజలు కమ్యూనిజాన్ని మరిచిపోలేరన్నారు.

తుఫాన్ తో అపార నష్టం:  సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

తుఫాన్ తో రాష్ట్రంలో పత్తి వరి తదితర పంటలకు అపార నష్టం జరిగిందని, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు.  కార్పొరేట్ శక్తుల దోపిడీ లాంటి సమస్యలకు పరిష్కారం కమ్యూనిజమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి  అన్నారు.

 సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్ ప్రసంగించారు.  సీపీఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఈ ప్రోగ్రాం నిర్వహించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరం మల్లేశ్వరి, ధూళిపాల ధనుంజయ నాయుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఉస్తేల నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.