 
                                    ఎడపల్లి, వెలుగు : అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని జానకంపేట్ గ్రామ శివారులో తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లలకు తరలించాలని ఆదేశించారు. ఇకపై కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలనన్నారు.
మండలంలో తడిసిన ధాన్యం ఎంత ఉంటుందనే వివరాలు తెలుసుకుని నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎడపల్లి తహసీల్దార్ దత్తాద్రి, ఎడపల్లి సింగిల్ విండో చైర్మన్ మల్కారెడ్డి, జానకంపేట్ సింగిల్ విండో చైర్మన్ నరేందర్, కార్యదర్శులు గంగారెడ్డి, రాజారాం, తదితరులు ఉన్నారు.
రెంజల్ ఏవోకు షోకాజ్ నోటీసు
నవీపేట్, వెలుగు : ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం, విధుల్లో అలసత్వం వహించినందుకు రెంజల్మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సిద్ది రామేశ్వర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం మండలంలోని అభంగపట్నం, తడ్ గాం, రెంజల్ మండలం వీరన్నగుట్ట గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వీరన్నగుట్ట కొనుగోలు కేంద్రం నుంచి కేటాయించిన రైస్ మిల్లుకు కాకుండా వేరే మిల్లుకు పంపించడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.
ధాన్యం కాంటా వేయగానే ట్యాబ్‌లో ఎంట్రీ చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. తుఫాన్ ప్రభావంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తడవకుండా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటరమణ, ఐకేపీ ఏపీఎం మహేశ్ తదితరులు ఉన్నారు.

 
         
                     
                     
                    