కూతురు చనిపోయిన దుఃఖంలో ఉంటే.. లంచం అంటూ పీక్కుతిన్నారు: ఓ అధికారి వెలుగులోకి తెచ్చిన నమ్మలేని నిజం

కూతురు చనిపోయిన దుఃఖంలో ఉంటే.. లంచం అంటూ పీక్కుతిన్నారు: ఓ అధికారి వెలుగులోకి తెచ్చిన నమ్మలేని నిజం

కూతురు చనిపోయిన బాధలో ఉన్న సమయంలో కూడా లంచాల కోసం పీక్కుతినే పరిస్థితులపై ఒక రిటైర్డ్ అధికారి ఆవేదన వ్యక్తం చేశాడు. బెంగళూరులో తనకు ఎదురైన పరిస్థితి వింటే ప్రతి ఒక్కరికీ కన్నీరు రాక మానదు. ఇలాంటి వారిని చూస్తుంటే మానవత్వం చచ్చిపోయింది అనిపించకమానదు. అయినా ఇలాంటి వారికి తమకూ ఒక ఫ్యామిలీ ఉందనే సెన్స్ ఎందుకు ఉండదో అర్థం కాదు సమాజంలో.

వివరాల్లోకి వెళితే.. భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ (ఫైనాన్స్), సీఎఫ్‌ఓగా పనిచేసిన కే.శివకుమార్ కూతురి అకస్మాత్తు మరణంతో బాధలో ఉన్నారు. కేవలం 34 ఏళ్ల వయసులో కూతురు అక్షయ, మెదడులో రక్తస్రావం కారణంగా సెప్టెంబర్ 18న మరణించింది. ఆమె ఐఐటీ మద్రాస్, ఐఐఎమ్ అహ్మదాబాద్‌లలో చదివి, గోల్డ్‌మన్ సాక్స్‌లో 8 ఏళ్లు పనిచేసిన వ్యక్తి. గుండె పగిలిన ఆ సమయంలో శివకుమార్ కూతురిని స్మశానానికి చేర్చే మార్గంలో అచంచల మనోధైర్యం కంటే పెద్ద పరీక్షను ఎదుర్కొన్నారు. అదే అడుగడుగునా లంచాల డిమాండ్ చేయటం. 

అంబులెన్స్ డ్రైవర్, పోలీసుల నుంచి డెత్ సర్టిఫికెట్ ఇచ్చే మున్సిపల్ అధికారుల వరకు అందరిదీ ఒకటే కోరిక ఎంత డబ్బులు ఆయన నుంచి లాగొచ్చు అనేదే. శివకుమార్ తన కుమార్తె మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఆస్పత్రికి తరలించడానికి రూ.5వేలు డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్‌తో మొదలైన ఈ ప్రయాణం.. ఆపై పోలీస్‌స్టేషన్‌లో అధికారులు చూపిన అసభ్య ప్రవర్తన, FIR కాపీ ఇచ్చేందుకు కోరిన లంచాలు మనసును ఛిద్రము చేశాయి. అసలే దుఃఖంలో ఉన్నప్పుడు ఇలా డబ్బు అడిగే వారికి  మనస్సు ఉందా?" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

లంచాల కథ ఇక్కడితో ముగియలేదు.. పోస్టుమార్టం పత్రాలకు కూడా అధికారుల నుండి స్పష్టమైన లంచం డిమాండ్లు రావడం ఆయనను కలచివేసింది. పోలీసు స్టేషన్‌లోనే క్యాష్ ఇచ్చి పత్రాలు తీసుకున్నానని.. అక్కడ సీసీటీవీ లేదని అధికారి తన పోస్టులో వెల్లడించారు. చివరగా బెంగళూరులోని బృహత్ బెంగళూరు మహానగర పాలికే కార్యాలయంలో అధికారులు డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు వాస్తవంగా వసూలు చేయాల్సిన ఫీజు కంటే ఎక్కువ అంటే లంచం చెల్లించకపోతే మరణ ధృవపత్రం ఇవ్వలేదని వాపోయారు.

తమ లాంటి వారి పరిస్థితే ఇలా ఉంటే.. “పేదల పరిస్థితి ఏమిటి?” అంటూ ఆయన ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. ఆయన ఈ పోస్టుతో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన స్పందన వచ్చింది. చాలా మంది పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలని డిమాండ్ చేస్తూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే విశ్వహిందూ పరిషత్ నాయకుడు గిరీశ్ భారద్వాజ్ బెంగళూరు పోలీస్ కమిషనర్ శివకుమార్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇంతటి అవినీతి రాజ్యమేలుతున్న దేశంలో ఒక తండ్రి తన కూతురి మృతదేహాన్ని గౌరవంగా అంతిమ సంస్కారాలు పూర్తి చేసి పంపేందుకు ఇన్ని అవరోధాలు ఎదుర్కోవడం మనసులను కలచివేస్తోంది.