ధరణి సమస్యలు తీర్చమంటే.. దరఖాస్తులు రిజెక్ట్​!

ధరణి సమస్యలు తీర్చమంటే.. దరఖాస్తులు రిజెక్ట్​!
  • సమస్యలు తీర్చమంటే.. దరఖాస్తులు రిజెక్ట్​!
  • ధరణిలో నిషేధిత భూముల అప్లికేషన్లపై కలెక్టర్ల తీరిది
  • తహసీల్దార్ రిపోర్ట్ కూడా తెప్పించుకోకుండా రిజెక్ట్ చేస్తున్న ఆఫీసర్లు
  • ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవాలని పాత పట్టాదార్లకు మెసేజ్‌లు

హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్ లో వివిధ సమస్యలపై పెట్టుకున్న అప్లికేషన్లను పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే కలెక్టర్లు రిజెక్ట్ చేస్తుండడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తహసీల్దార్ల నుంచి గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకోకుండానే అప్లికేషన్లను తిరస్కరించడంపై విమర్శలు వస్తున్నాయి. సీఎస్, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు అప్లికేషన్లు క్లియర్ చేశామని, డ్యాష్ బోర్డులో పెండింగ్ దరఖాస్తులు లేవని చూపించేందుకు కలెక్టర్లు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే తెలుస్తోంది.

ఒక్క టిక్ తో రిజెక్ట్...
పేదలు, స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ సైనికులకు ప్రభుత్వం అసైన్ చేసిన భూములతోపాటు వివిధ అవసరాలకు ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించిన సర్వే నంబర్లన్నింటినీ ధరణిలో నిషేధిత జాబితాలో చేర్చారు. స్వాతంత్ర్య సమర యోధులు, మాజీ సైనికులకు ప్రభుత్వం భూములు అసైన్ చేసిన పదేండ్ల తర్వాత నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉన్నప్పటికీ.. తొలగించలేదు. అట్లనే వివిధ ప్రాజెక్టులు, కాల్వలు, రోడ్ల నిర్మాణం కోసం రైతులు తమకున్న భూమిలో కొంత భూమిని సర్కార్ కు అప్పగిస్తే ఆ సర్వే నంబర్ మొత్తాన్ని నిషేధిత భూముల లిస్టులో పెట్టిన్రు. ఇసొంటి బాధితులంతా తమ భూములను నిషేధిత భూముల లిస్ట్ నుంచి తొలగించాలని కోరుతూ పెట్టుకున్న అప్లికేషన్లను ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే కలెక్టర్లు రిజెక్ట్ కొడుతున్నారు. ప్రొహిబిటెడ్ భూమి లిస్ట్ నుంచి తొలగించుకునేందుకు ధరణిలో ఇచ్చిన ఆప్షన్ ద్వారా ఇప్పటి దాకా 1.20 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వాటిలో కేవలం 82,472 దరఖాస్తులను డిస్పోజ్ చేశారు. డిస్పోజ్ చేసిన అప్లికేషన్లలోనూ సగానికిపైగా రిజెక్ట్ చేసినవే ఉండడం వాటిని విచారించిన తీరును వెల్లడిస్తోంది. ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న భూసమస్యల పరిష్కారానికి సీఎస్, ఇతర ప్రభుత్వ పెద్దలు ఐదు, పది రోజులే డెడ్ లైన్ విధించడం, కలెక్టర్లు ఎలాంటి ఎంక్వైరీ లేకుండా, కనీసం దరఖాస్తును చదవకుండానే రిజెక్ట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు రిజెక్ట్ చేశారో కనీసం కారణం చెప్పే యంత్రాంగం కూడా లేదు. ఇంకోదిక్కు అప్లికేషన్ నంబర్ కొట్టి చూస్తే సమస్య పరిష్కారమైనట్లు మెస్సేజ్ కనిపించినా.. ధరణిలో మాత్రం అందుకనుగుణంగా మార్పులు కనిపించడం లేదు.

ఈకేవైసీ పేరుతో ఇంకో చిక్కు.. 
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇదివరకు రిజిస్ట్రేషన్ జరిగి ధరణిలో మ్యుటేషన్ పెండింగ్ లో ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఉంటే.. ముందుగా ఆ జాబితా నుంచి తొలగించాకే మ్యుటేషన్ చేయడానికి వీలుంటుంది. ఆ భూమిని, సర్వే నంబర్ ను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కొనుగోలుదారు అప్లికేషన్ పెడితే.. పాత పట్టాదారు పేరిట ఈకేవైసీ పూర్తి చేయాలని మెస్సేజ్ రావడం సమస్యగా మారింది. ఎప్పుడో భూములు అమ్ముకున్నవాళ్ల వద్దకు ఈకేవైసీ పూర్తి చేయాలని వెళితే వాళ్లు ఎట్ల స్పందిస్తారో అర్థం కాని పరిస్థితి.ఒకవేళ వాళ్లు అందుబాటులో లేకున్నా, రాకపోయినా సమస్య అలాగే ఉంటుంది. ధరణి పేరిట భూసమస్యలను పరిష్కరిస్తున్నారో? లేక కొత్త సమస్యలు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని భూసమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.