- ఆడపిల్ల పుడితే రూ.2 వేలు, తీజ్ పండుగకు రూ.20 వేలు
మెదక్, వెలుగు: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి తన హామీలతో ఆకట్టుకుంటున్నారు. మెదక్ జిల్లా హవేలీ ఘన్ పూర్ మండలం రాజుపేట తండా కాప్రాయిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి బీఆర్ఎస్ మద్దతుతో కె.మౌనిక బరిలో ఉన్నారు.
తనను సర్పంచ్ గా గెలిపిస్తే అమలు చేసే 15 హామీలను రూ.100 బాండ్ పేపర్ పై రాసిచ్చారు. గ్రామంలో ఆడపిల్ల పుట్టిన వారికి బంగారు తల్లి పేరుతో రూ.2 వేలు ఆర్థిక సాయం చేస్తానని, తీజ్ పండుగకు రూ.20 వేలు, ముదిరాజ్ బోనాల పండుగకు రూ.8 వేలు, ఎల్లమ్మ బోనాల పండుగకు రూ.3 వేలు విరాళం, గ్రామంలో ఎవరైనా అకాల మరణం చెందితే అంత్యక్రియల కోసం రూ.5 వేలు ఆర్థిక సాయం చేస్తానని హామీలు ఇచ్చారు.
ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే తనను కలెక్టర్ లేదా జిల్లా కోర్టు ద్వారా సర్పంచ్ పదవి నుంచి తొలగించవచ్చని పేర్కొన్నారు. సదరు బాండ్ పేపర్‌ను గ్రామ ప్రజలకు చూపిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఆమె హామీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
