పావలా వడ్డీ, స్త్రీనిధి బకాయిలు చెల్లించాలంటూ ధర్నా

పావలా వడ్డీ,  స్త్రీనిధి బకాయిలు చెల్లించాలంటూ ధర్నా

కామారెడ్డి ,  వెలుగు : మహిళ  సంఘాలకు పావలా వడ్డీ,  అభయహస్తం,  స్ర్తీ నిధి బకాయిలు వెంటనే  చెల్లించాలని డిమాండ్​ చేస్తూ   శుక్రవారం కామారెడ్డి జిల్లాలో డ్వాక్రా మహిళలు కదం తొక్కారు. జిల్లా కేంద్రంలో  భారీ ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో ధర్నా చేశారు.  బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో వివిధ గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.   గాంధీ గంజ్​  నుంచి  సిరిసిల్ల రోడ్డు,  స్టేషన్​ రోడ్డు, రైల్వే కమాన్​, హైస్కూల్​ రోడ్డుల మీదుగా నిజాంసాగర్​ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. ఐదేండ్లుగా పావలావడ్డీ, అభయహస్తం   బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు.   బకాయిలు చెల్లించేవరకు   పోరాడతామన్నారు. ప్రభుత్వం వెంటనే  బకాయిలు రిలీజ్​ చేయాలని డిమాండ్​ చేశారు. 2018 లో కూడా  బకాయిల కోసం  మహిళలు ఆందోళన చేశారు. వారికి   మద్దతుగా వెంకటరమణరెడ్డి ఆమరణ నిరహార దీక్ష చేయగా ప్రభుత్వం  పావలా వడ్డీ బకాయిలు చెల్లించింది.  మళ్లీ  బకాయిలు పెరిగిపోవడంతో  ఆందోళన చేపట్టారు.

10 నుంచి ఆమరణ నిరహార దీక్ష

డ్వాక్రా మహిళలకు  రావాల్సిన బకాయిలను వెంటనే రిలీజ్​ చేయాలని,  లేనట్లయితే ఈనెల 6 నుంచి 9 వరకు నిరహార దీక్షలు చేస్తామని,   అప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 10  నుంచి ఆమరణ నిరహార దీక్ష చేపడతానని   బీజేపీ కామారెడ్డి నియోజక వర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి హెచ్చరించారు.  టీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత  మహిళలకు సంబంధించిన   స్కీమ్ లను  ఎత్తేసిందని, వారికి రావాల్సిన బకాయిలను కూడా ఐదేండ్లుగా ఇవ్వడంలేదన్నారు.  ర్యాలీ, ధర్నాలో పార్టీ లీడర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.