దళిత ముస్లింలు, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని ఢిల్లీలో ధర్నా

దళిత ముస్లింలు, క్రిస్టియన్లకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని ఢిల్లీలో ధర్నా

ఢిల్లీ​, వెలుగు :  దళిత ముస్లింలకు , క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని ఆల్ ఇండియా దళిత, ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి  ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్​మంతర్​లో  మంగళవారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ1950 ఆగస్టు 10న వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లను తొలగించారన్నారు. 

1956లో దళిత సిక్కులకు, 1990లో దళిత బౌద్ధులకు తిరిగి రిజర్వేషన్లు కల్పించినా దళిత ముస్లింలకు, క్రైస్తవులకు మాత్రం పునరుద్దరించలేదన్నారు. జస్టిస్ రాజేంద్ర కమిటీ రిపోర్ట్​లో, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సుల్లో  రిజర్వేషన్లు పునరుద్ధరించాలని సూచించారన్నారు. -రిజర్వేషన్లు  కల్పిస్తామని 2009లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసినా అమలు చేయలేదని, వెంటనే రిజర్వేషన్లు పునరుద్ధరించాలని డిమాండ్​ చేశారు. పోరాట సమితి నాయకులు షేక్ సత్తార్ సాహెబ్,  డాక్టర్ ఇస్లాముద్దీన్, మాదిగ జేఏసీ  అధ్యక్షుడు పిడమర్తి రవి, ఖలీల్ అహ్మద్, అబ్దుల్ అహ్మద్, మీర్ ఫహద్ అలీ, మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.