రవిశాస్త్రి కంటే ధోనీ ప్రభావశీలి : మాన్ సింగ్

రవిశాస్త్రి కంటే ధోనీ ప్రభావశీలి : మాన్ సింగ్

వరల్డ్‌‌ కప్‌‌లో కోచ్‌‌ రవిశాస్త్రి కంటే మాజీ కెప్టెన్‌‌ ఎంఎస్‌‌ ధోనీనే జట్టుపై ఎక్కువ ప్రభావం చూపుతాడని 1983 ప్రపంచకప్‌‌ గెలిచిన టీమిండియా మేనేజర్‌‌ పీఆర్‌‌ మాన్‌‌సింగ్‌‌ అభిప్రాయపడ్డారు. ధోనీ అనుభవం, క్రికెట్‌‌ పరిజ్ఞానం అక్కరకు వస్తాయన్నారు. 36 ఏళ్ల క్రితం కపిల్‌‌ డెవిల్స్‌‌ లార్డ్స్‌‌లో వరల్డ్‌‌ కప్‌‌ ముద్దాడటం వెనుక జట్టు మేనేజర్‌‌గా కీలక పాత్ర షోషించిన మాన్‌‌సింగ్‌‌ స్వతహాగా క్రికెటర్‌‌. హైదరాబాద్‌‌లో స్థిరపడిన మాన్‌‌సింగ్‌‌ పలు ఫస్ట్‌‌ క్లాస్‌‌ క్రికెట్‌‌ మ్యాచ్‌‌లు ఆడారు. ఆ తర్వాత టీమిండియా మేనేజర్‌‌గా, హైదరాబాద్‌‌ బ్లూస్‌‌ జట్టు మేనేజర్‌‌గా, హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ సెక్రటరీగా పని చేశారు. ఇంగ్లండ్‌‌లో నాటి మధుర జ్ఞాపకాలతోపాటు ఈసారి వరల్డ్‌‌కప్‌‌ ఆడే జట్టుపై తన అభిప్రాయలను ఆయన పంచుకున్నారు.

ఎక్స్‌‌ట్రా లగేజ్‌‌ అంటే నాలుగు వేలు కట్టాం

ఇండియాలో క్రికెట్‌‌ దశ, దిశా మార్చిన 1983 వరల్డ్‌‌కప్‌‌ విజయం వెనక చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. వీటి గురించి మాన్‌‌సింగ్‌‌ మాట్లాడుతూ .. ‘‘జట్టు విదేశీ టూర్‌‌కు జట్టు వెళ్లేటప్పుడు బీసీసీఐ ఫేర్‌‌వెల్‌‌ పార్టీ ఇస్తుంది. అయితే డబ్బు లేక ఫేర్‌‌వెల్‌‌ పార్టీ లేకుండానే1983 వరల్డ్‌‌ కప్‌‌కు టీమిండియా బయలుదేరింది. కౌంటీ క్రికెట్‌‌ కోసం కపిల్‌‌దేవ్‌‌, అమర్‌‌నాథ్‌‌, కీర్తీ అజాద్‌‌, మదన్‌‌లాల్‌‌ అప్పటికే ఇంగ్లండ్‌‌లో ఉన్నారు. వాళ్ల కిట్లు, జెర్సీలు తీసుకుని మిగిలిన జట్టంతా ప్రయాణమయ్యాం. అయితే ఎక్స్‌‌ట్రా లగేజ్‌‌ ఉందని ముంబై ఎయిర్‌‌పోర్ట్‌‌ అధికారులు మా నుంచి రూ.4000 వసూలు చేశారు. మేము ఇండియా టీమ్‌‌ అని చెప్పినా వాళ్లు ఒప్పుకోలేదు.  గత రికార్డుల ప్రకారం టీమ్‌‌పై ఎవ్వరికీ అంచనాలు లేవు. కేవలం సెమీఫైనల్‌‌, ఫైనల్‌‌ మాత్రమే దూరదర్శన్‌‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఫైనల్‌‌లో వెస్టిండీస్‌‌కు షాకిచ్చిన కపిల్‌‌ డెవిల్స్‌‌కు ప్రైజ్‌‌మనీ కింద ఇరవై వేల పౌండ్లు దక్కాయి. 2019 వరల్డ్‌‌ కప్‌‌కు ప్రైజ్‌‌మనీ రూ.28 కోట్లు అయ్యింది. ప్రపంచకప్‌‌ గెలిచి స్వదేశానికి వచ్చిన జట్టుకు బీసీసీఐ లక్ష రూపాయలు చొప్పున ఇచ్చింది. అది కూడా  ఓ సంగీత విభావరి నిర్వహించి ఆ మొత్తాన్ని సేకరించింది. అప్పట్లో జట్టుకు కోచ్‌‌ లేడు. మేనేజర్‌‌, టూర్‌‌ సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌, ట్రైనింగ్‌‌, ట్రావెలింగ్‌‌ అని పనులు నేనే చూసుకున్నా. జట్టులో రెండు వర్గాలుండేవి. చాలా గొడవలు జరిగేవి. అయితే వారందరి నుంచి నాకు సహకారం ఉండేదని’’ ఆయన అన్నారు. కోహ్లీ సేన వరల్డ్‌‌కప్‌‌ అవకాశాలపై మాన్‌‌సింగ్‌‌ మాట్లాడుతూ.. ఇంగ్లండ్‌‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతోపాటు టీమిండియా ఈసారి ఫేవరెట్‌‌ లిస్ట్‌‌లో ఉంది. దాయాది పాక్‌‌ మాత్రం అండర్‌‌డాగ్‌‌గా బరిలోకి దిగుతుంది. కోచ్‌‌ రవిశాస్త్రి కంటే ధోనీ ప్రభావమే జట్టుపై ఎక్కువుగా ఉంటుంది. మహీ అనుభవం, నైపుణ్యాలే ఇందుకు కారణం. నాలుగో నంబర్‌‌ స్థానంపై ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారో అర్థం కావడం లేదు. మ్యాచ్‌‌ పరిస్థితుల ప్రకారం ఆ స్థానంపై నిర్ణయం ఉండాలి అని పేర్కొన్నారు.