ధోని బంపరాఫర్.. CSK జట్టులోకి కమెడియన్!

ధోని బంపరాఫర్.. CSK జట్టులోకి కమెడియన్!

భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి చెన్నైతో ఉన్న అనుంబంధం అందరికీ విదితమే. పుట్టి పెరిగింది రాంఛీలో అయినా.. ధోని అంటే అందరకీ గుర్తొచ్చేది.. చెన్నైయే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అతను అందించిన విజయాలే అంతటి కీర్తిని తెచ్చాయి. ఆ బంధాన్ని మరింత పదిలం చేసుకుంటూ సౌత్‌ ఇండస్ట్రీలో తన పేరిట ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించి తొలి సినిమాను నిర్మించారు.. ధోని.

ధోని ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కిన తొలి సినిమా లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌(Let's Get Married) ట్రైలర్‌, ఆడియో లాంచ్‌ కార్యక్రమం చెన్నై వేదికగా ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు LGM సినిమాలో నటించిన హరీశ్‌ కళ్యాణ్‌, నదియా, ఇవానా, కమెడియన్‌ యోగిబాబు, ఆర్జే విజయ్‌ తదితరులు హాజరయ్యారు. ధోని, అతని సతీమణి సాక్షి తమ చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు.

రాయుడు ప్లేస్‌లోకి యోగిబాబు

ఈ సందర్బంగా మాట్లాడిన తమిళ కమెడియన్ యోగి బాబు తనలో ఉన్న హాస్యాన్ని బయటకి తీశారు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున క్రికెట్ ఆడాలని ఉందని తెలిపారు. అవకాశం ఇస్తారా! అని ధోనిని ప్రశ్నించారు. అందుకు బదులిచ్చిన ధోనీ అదే రీతిలో ఫన్నీ సమాధానమిచ్చారు. అంబటి రాయుడు రిటైర్ అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ..అతని స్థానంలో ఆడొచ్చన్నారు.

'రాయుడు రిటైర్ అయ్యారు కదా. జట్టులో ఒక ప్లేస్ ఖాళీగానే ఉంది. నేను మేనేజ్‌మెంట్‌తో మాట్లాడతా. కానీ నువ్వు సినిమాలతో బిజీగా ఉంటున్నావు. నేనైతే మీరెప్పుడూ జట్టుతోనే ఉండాలని, నిలకడగా ఆడాలని కోరుకుంటా. కానీ బౌలర్లు అలా చూస్తూ ఊరుకోరు. వేగంగా బంతులేస్తారు. నిన్ను ఎలాగైనా గాయపరచాలని చూస్తారు. మరి నీ ఇష్టం..' అని యోగిబాబుకు వార్నింగ్ ఇచ్చారు. ధోని ఇచ్చిన ఈ సమాధానానికి ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేకపోయారు.