వయసుతో సంబంధం లేదు. మేమంతా ఇప్పటికీ యువకులమే: బ్రావో

వయసుతో సంబంధం లేదు. మేమంతా ఇప్పటికీ యువకులమే: బ్రావో

న్యూఢిల్లీ: డాడ్స్‌ ఆర్మీగా పేరు పడిన చెన్నై సూపర్‌కింగ్స్‌ టీమ్‌ గురించి ఆ జట్టు ప్లేయర్‌ డ్వేన్‌ బ్రావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ టీమ్‌ లో వయసు మళ్లిన వారు చాలా మంది ఉన్నారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారని, తామంతా 32నుంచి 35 ఏళ్ల మధ్య వారమేనని చెప్పుకొచ్చాడు. వయసు సంఖ్యతో తమకు సంబంధం లేదని, ఇప్పటికీ తామంతా యువకులమే అనుకుంటున్నామని పేర్కొన్నాడు. ఆటగాళ్ల  ఫిట్‌ నెస్‌ లెవల్స్‌ చూడాలని, తమకు చాలా అనుభవముందని విమర్శకులకు పరోక్షంగా బదులిచ్చాడు. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమించేం దుకు అనుభవం ఉపకరిస్తుందని, అలాగే  ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ కెప్టెన్‌ తమ జట్టును నడిపిస్తున్నాడని ఎంఎస్‌ ధోనీపై ప్రశంసలు కురిపించాడు. జట్టుగా తమకున్న బలహీనలతపై అవగాహన ఉందని,ఈ క్రమంలోనే తాము చాలా స్మార్ట్‌‌‌‌‌‌‌‌గా ఆడతామని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయంలో ధోనీ ఎల్లప్పుడూ తమను ముందుండి నడిపిస్తాడని పేర్కొన్నాడు. ప్రణాళికల రూపకల్పన కన్నా పరిస్థితులకు తగినట్టుగా ఆటను మార్చు కోవడమే తమ విజయ రహస్యమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

ఎవరి స్టైల్ వారిదే

తమ జట్టులో ఒక్కో ప్లేయర్‌ కు ఒక్కో స్టైల్‌‌‌‌‌‌‌‌ ఉందని బ్రావో వ్యాఖ్యానిం చాడు. సీఎస్‌ కేకు సంబంధించి టీమ్‌ మీటింగ్‌ లు, ప్రణాళికలు ఏమీ ఉండవని, ఆట ఫ్లో ప్రకారం నడుచుకోవడమేనని పేర్కొన్నాడు. సాధారణంగా తాను స్లో బంతులతో పాటుబౌలింగ్‌ లో వైవిధ్యం చూపిస్తానని, అయితే మంగళవారం మ్యాచ్‌ లో వికెట్‌కు తగినట్లుగా బౌలింగ్‌ చేశానని చెప్పుకొచ్చాడు. వికెట్ల వెనక నుంచి కెప్టెన్‌ ధోనీ తనకు కావాల్సి న విధంగా బౌలింగ్‌ చేయించుకుంటాడని ప్రశంసించాడు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరయ్యాక  లీగ్‌ ల్లోఆడడం చాలా కఠినంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అయితే లీగ్‌ ల్లో ఆడడం ద్వారా చాలా నేర్చు కోవచ్చని, స్కిల్స్‌ ను అభివృద్ధి చేసుకున్నట్లయి అవసరమైనప్పుడు ఉపకరిస్తాయని బ్రావో పేర్కొన్నాడు.