ధోనీ మోకాలి నొప్పి చికిత్స ఖర్చు 40 రూపాయలే

ధోనీ మోకాలి నొప్పి చికిత్స ఖర్చు 40 రూపాయలే

రాంచీ:  ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొన్ని నెలలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ తన మోకాలి నొప్పి కోసం వందన్ సింగ్ ఖేర్వార్ అనే ఆయుర్వేద డాక్టర్ వద్ద చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆ డాక్టరే ప్రకటించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే... కెప్టెన్ గా, ఓ ఆటగాడిగా ధోనీ భారత క్రికెట్ కు ఎంతో సేవ చేశాడు. అలాగే ఐపీఎల్ లో సీఎస్కే జట్టుకు కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయితే ఈ క్రమంలోనే ధోనీ ఎన్నోసార్లు మోకాళ్ల నొప్పితే బాధపడ్డాడు. మోకాళ్ల నొప్పి కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందాడు. కానీ ఈ ట్రీట్ మెంట్ తో ధోనీ మోకాళ్ల నొప్పి నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందలేకపోయాడు.

ఈ నేపథ్యంలోనే రాంచీకి 70 కిలో మీటర్ల దూరంలో ఉన్న లపంగ్ గ్రామానికి చెందిన వందన్ సింగ్ ఖేర్వార్ అనే ఆయుర్వేద డాక్టర్ ను సంప్రదించాడు. తన సమస్యను వివరించాడు. అనంతరం ధోనీకి పరీక్షలు చేసిన డాక్టర్... మోకాళ్ల నొప్పికి కావాల్సిన మందులు ఇచ్చాడు. అయితే... ఆ మందుల ఖర్చు కేవలం 40 రూపాయలే. ఆ ఫీజు చెల్లించి ధోనీ తన మోకాళ్ల నొప్పికి మందులు తీసుకున్నాడు.  ధోనీ లాంటి ఓ పెద్ద సెలెబ్రిటీ తన వద్దకు వైద్యానికి రావడం ఆనందంగా ఉందని ఆ డాక్టర్ చెబుతున్నాడు. కాల్షియం సమస్యతో ధోనీ బాధపడుతున్నట్లు వందన్ సింగ్ తెలిపాడు. మందుల కోసం ధోనీ తరచుగా తన వద్దకు వస్తున్నట్లు ఆయన చెప్పాడు. ఇక ధోనీ తల్లీదండ్రులు కూడా ఆ వైద్యుడి వద్దే మోకాళ్ల నొప్పికి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ధోనీకి వందన్ సింగ్ ఖేర్వార్ గురించి తెలిసింది. ఇక ధోనీ అక్కడికి వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతం అతడి ఫ్యాన్స్ తో కోలాహలంగా మారుతోంది.