Dhurandhar Box Office: ప్రభాస్ రికార్డులను బద్దలు కొట్టిన రణవీర్ సింగ్.. రూ. 1000 కోట్ల దిశగా 'ధురంధర్'!

Dhurandhar Box Office: ప్రభాస్ రికార్డులను బద్దలు కొట్టిన రణవీర్ సింగ్.. రూ. 1000 కోట్ల దిశగా 'ధురంధర్'!

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ 'ధురంధర్' మూవీ రికార్డులు సృష్టిస్తోంది. ఇది కేవలం ఒక సినిమాగా కాకుండా..  బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకుపోతోంది . ఇండియన్ సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిన 'బాహుబలి 2' రికార్డును సైతం తుడిచిపెట్టేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా, విడుదలైన మూడో వారంలోనూ రికార్డుల వేటను కొనసాగిస్తూ ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

బాహుబలి 2 రికార్డు బద్ధలు!

గత ఎనిమిదేళ్లుగా ఏ భారతీయ సినిమా టచ్ చేయలేకపోయిన ఒక అరుదైన రికార్డును 'ధురంధర్' తన ఖాతాలో వేసుకుంది. భారతీయ బాక్సాఫీస్ చరిత్రలో 16వ రోజు అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ఇప్పటివరకు  ప్రభాస్ 'బాహుబలి 2' మూవీ సుమారు రూ. 36 కోట్లతో అగ్రస్థానంలో ఉండేది. అయితే, 'ధురంధర్ 'తన 16వ రోజున ఏకంగా రూ. 39 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆ రికార్డును తిరగరాసింది. మూడో వారంలో కూడా ఈ స్థాయి వసూళ్లు రావడం ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.

కలెక్షన్ల సునామీ.. 

డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 870.36 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.  బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఇండియాలలో రూ. 579.20 కోట్లు. ఓవర్సీస్ లో రూ. 186.90 కోట్లు వసూళ్లు సాధించింది. మూడో వీకెండ్ కూడా దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల విడుదలైన హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ 'అవతార్' ఇండియా కలెక్షన్లను కూడా ధురంధర్ వెనక్కి నెట్టేసింది.  క్రిస్మస్ సెలవుల నాటికి ఈ చిత్రం రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశభక్తి.. యాక్షన్.. ఎమోషన్!

'ధురంధర్' కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం పోరాడే యోధుల కథ. భారత నిఘా సంస్థల ఆపరేషన్ల నేపథ్యంలో సాగే ఈ కథలో రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దేశంపై జరిగే ఒక భారీ కుట్రను అడ్డుకోవడానికి కొందరు అధికారులు ప్రాణాలకు తెగించి ఎలా పోరాడారు అనేదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యం. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి దిగ్గజ నటుల కలయిక సినిమాకు వెన్నెముకగా నిలిచింది. ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకత ఉండటం, స్క్రీన్‌ప్లే ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగడం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. సారా అర్జున్ కీలక పాత్రలో మెప్పించగా, ఆదిత్య ధర్ టేకింగ్ ప్రేక్షకులకు హాలీవుడ్ స్థాయి అనుభూతిని ఇస్తోంది.

విమర్శలు ఉన్నా.. విజయం ఆగలేదు!

సోషల్ మీడియాలో కొంతమంది ఈ సినిమాపై విమర్శలు చేసినప్పటికీ, ప్రేక్షకుల నుంచి అందుతున్న స్ట్రాంగ్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ముందు అవి నిలవలేదు. దేశభక్తి నిండిన సన్నివేశాలు, అద్భుతమైన విజువల్స్ , బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ ఈ సినిమాను ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.  భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెబుతున్న 'ధురంధర్', రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.