లైఫ్​ స్టయిల్​ మార్పుల​తో తీపిరోగాన్ని కంట్రోల్‌ చేయొచ్చు

లైఫ్​ స్టయిల్​ మార్పుల​తో తీపిరోగాన్ని కంట్రోల్‌ చేయొచ్చు

తీపిరోగం ఒక్కసారి వచ్చిందంటే సచ్చేదాక వదిలిపెట్టదు అంటుంటారు. కానీ.. ఈ రోగం  పూర్తిగా నయం కాకపోయినా.. కొన్ని లైఫ్​ స్టయిల్​ మార్పుల​తో కంట్రోల్‌ చేయొచ్చు అంటున్నారు డాక్టర్లు. తిండిలో మార్పులు, వ్యాయామం లాంటివి చేయడం వల్ల షుగర్​ వల్ల వచ్చే అదనపు అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. షుగర్​ వచ్చినవాళ్లు చేసుకోవాల్సిన కొన్ని అలవాట్లు..

హెల్దీ ఫుడ్​

ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే.. అనేక రోగాలకు దూరంగా ఉండొచ్చనేది పెద్దల మాట. ముఖ్యంగా షుగర్​ వచ్చినవాళ్లు చేసుకోవాల్సిన మొదటి మార్పు ఇదే. షుగర్​ని హెల్దీ ఫుడ్​ హ్యాబిట్స్​తో కంట్రోల్​లో ఉంచుకోవచ్చు. పండ్లు, ఆకు కూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు తినడం మంచిది​. తక్కువ జీఐ ఉన్న ఫుడ్స్​ తీసుకోవాలి. ఆకు కూరలు ఎక్కువగా తినాలి.

ప్రొటీన్ తినాలి

ప్రొటీన్ జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే గ్లూకోజ్ శోషణ కూడా నెమ్మదిగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవాళ్ల రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. పచ్చి శెనగలు, నల్ల శెనగలు, రాజ్మా, పుట్టగొడుగులు, పప్పులు, మష్రూమ్​ లాంటివి ఫుడ్​లో చేర్చుకోవాలి.

కార్బ్‌ తగ్గించాలి

కార్బోహైడ్రేట్లు సమతుల్య ఆహారంలో ముఖ్యమైన భాగమే. కానీ.. అవసరం ఉన్నదానికంటే ఎక్కువగా తీసుకుంటేనే ప్రమాదం. తినే కార్బోహైడ్రేట్ల పరిమాణం, రకం అన్నీ చూసుకోవాలి. కిన్వా, మిల్లెట్స్​, బ్రౌన్ రైస్, ఓట్స్ లాంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లను కచ్చితంగా ఫుడ్​లో చేర్చుకోవాలి. కానీ..  బ్రేక్​ఫాస్ట్​ సిరియల్స్​, బేక్​డ్​ ఫుడ్స్​, పండ్ల రసాలకు దూరంగా ఉంటేనే బెటర్​. మామూలు కార్బ్​ పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర వెంటనే పెరుగుతుంది. అలాంటివి తినడం తగ్గించాలి. ముఖ్యంగా బియ్యం, గోధుమల లాంటివి బాగా తగ్గించాలి.

ఎక్కువ జీఐ ఫుడ్స్​కి ‘నో’

ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్(జీఐ) ఉండే ఫుడ్స్​కి ‘నో’ చెప్పాలి. ఇవి రక్తంలో చక్కెర లెవల్స్​ని పెంచుతాయి. జీఐ అనేది పిండి పదార్థాలతో కూడిన ఆహారాలకు ఇచ్చే రేటింగ్ సిస్టమ్. ఎక్కువ జీఐ ఫుడ్స్​ రక్తంలో చక్కెర లెవల్స్​ని త్వరగా పెంచుతాయి. తక్కువ జీఐ ఉన్నవి రక్తంలో చక్కెర స్థాయిని బ్యాలెన్స్​ చేయడంలో సాయపడతాయి. బ్రెడ్, బంగాళాదుంప, తెల్ల బియ్యం, కుకీలు ఎక్కువ జీఐ ఉండే ఫుడ్స్​.

హెల్దీ ఫ్యాట్స్​

వంటల్లో హెల్దీ ఫ్యాట్స్​ ఉండే నూనెలు వాడాలి. ముఖ్యంగా ఆలివ్, అవకాడో, కొబ్బరి లాంటి నూనెలు వాడాలి. రక్తంలో చక్కెర లెవల్స్​ని బ్యాలెన్స్​ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. వెజిటబుల్​ ఆయిల్​, నెయ్యి, కూడా తినొచ్చు. ట్రాన్స్ ఫ్యాట్స్​ని తగ్గించాలి.

ప్రాసెస్ చేసిన ఫుడ్​

ప్రాసెస్​ చేసిన ఫుడ్​లో చక్కెర, కొవ్వు, ఎక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి అలాంటివాటిని తినకుండా ఉండటమే మంచిది.

వ్యాయామం

నడక, జాగింగ్, స్టేషనరీ సైక్లింగ్, ట్రెడ్‌మిల్ లాంటివి చేస్తుండాలి. వీటివల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు.  బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్​లో ఉంటుంది. పదివేల అడుగులు నడవాలి. అది వీలుకాదంటే కనీసం ఏడువేల అడుగులు అయినా నడవాలి.

ఒత్తిడి

పెరిగిన ఒత్తిడి కూడా రక్తంలో చక్కెర లెవల్స్​ పెరగడానికి కారణం అవుతుంది. మంచి ఫుడ్​,  యోగ, ధ్యానం లాంటివి చేస్తూ.. ఒత్తిడి తగ్గించుకోవాలి.

యోగ

డయాబెటిస్​ ఉన్నవాళ్లు డైలీ రొటీన్​లో యోగను కూడా చేర్చుకోవాలి. యోగ శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా హెల్దీగా ఉంచుతుంది.

రెగ్యులర్ చెకప్

ప్రతి ఒక్కరూ రెగ్యులర్ డాక్టర్‌ చెకప్‌ చేయించుకోవాలి. దీనివల్ల  ప్రి–-డయాబెటిస్ స్టేజ్​లోనే తెలుసుకోవచ్చు. ఈ దశలో తెలుసుకుంటే డయాబెటిస్​ బారిన పడకుండా తప్పించుకోవడం సులభం.