
ఏడాది పొడవునా ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి. వాటిల్లో ఈరోజు వచ్చే ఆషాఢశుక్ల ఏకాదశి మొదటిది. ఈ పండుగనే తొలి ఏకాదశి...శయన ఏకాదశి.....హరి వాసరం...పేలాల పండుగ .... అని కూడా పిలుస్తారు. ఆరోజు భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ తీరతాయని భక్తుల నమ్మకం. అతివృష్టి, అనావృష్టి, తెగుళ్ల నుంచి తమ పంటల్ని కాపాడాలంటూ రైతులు ఆ రోజు మహావిష్ణువుకి పూజలు చేస్తారు. ఈ పండుగ విశిష్టత గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.. !
హిందువులు ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి నెల ఎన్నో రకాల పండుగలను ఎంతో ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. విశ్వావశునామ సంవత్సరం(2025) జులై 6 వతేదీ ఆదివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.
కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ల బ్రహ్మదేవుడి వరంతో దేవతలు, రుషులనుబాగా హింసించేవాడు. ఆ రాక్షసుడితో శ్రీమహా విష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుంటాడు. ఆ సమయంలో మురాసురుడు మళ్లీ విష్ణువుకి హాని తలపెట్టాలని ప్రయత్నిస్తాడు.. అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుంచి యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పుట్టిన తిథి ప్రకారం ఆమెకి ఏకాదశి అని పేరుపెట్టాడు మహా విష్ణువు. విష్ణుప్రియగా ఆమె లోకం చేత పూజలు అందుకుంటుందని వరం కూడా ఇస్తాడు. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి. ఆరోజు ( జులై 6) ఉపవాసం చేస్తే అన్ని పాపాలనుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు భక్తులకి అభయమిస్తాడు.
పాపాలు తొలుగుతాయి
ఆరోజు ( జులై 6) సూర్యోదయానికన్నా ముందే విష్ణు ఆలయాలకి వెళ్తారు భక్తులు పుణ్య స్నానాలు చేసి విష్ణువుకి ఘనంగా పూజలు చేస్తారు. మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా పెడతారు. ఆ రోజు వ్రతం ఆచరించే వాళ్లు కాల్చినవి.. వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు, వెల్లుల్లి తినరు. మంచం మీద కూర్చోవడం, పడుకోవడం లాంటివి కూడా చేయరు. రాత్రంతా జాగారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే మహా విష్ణువుని దర్శించుకుంటారు.
ఇంకా ఏమేమి చేయాలంటే...
తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ధూపం.. దీపం.. నైవేద్యం తరువాత కర్పూర హారతి ఇవ్వాలి. భక్తులు ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. దుష్ట పనులు, ఆలోచనలు చేయకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు శ్రీహరిని పూజించి భోజనం చేయాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ .... ఈ ద్వాదశ మంత్రాన్ని జపించాలి. రామ, కృష్ణ, నారాయణ మొదలైన పేర్లతో భగవన్నామ స్మరణ చేయాలి. విష్ణు శహస్రనామాలను జపించండి. . ఈ పూజ చేసేవారు ధాన్యాలు, పప్పులు, శనగలు, మొక్క జొన్న, గోకరకాయ, చిక్కుడుకాయ, బఠాణిలను ఆహారపదార్ధాలుగా తీసుకోకూడదు.కేవలం పాలు పండ్లు వంటి పదార్థాలను తీసుకుని ఉపవాస దీక్షతో పూజ చేయాలి.
తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు కనుక ఈరోజు ఎట్టి పరిస్థితులలో తులసీ దళాలను కోయకూడదు. అలాగే స్వామి వారి పూజ అనంతరం స్వామివారికి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత విష్ణు సహస్రనామాలను చదవాలి.అదే విధంగా ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయమే స్వామివారికి పూజ చేసిన అనంతరం ఉపవాస దీక్ష విరమించాలి. ఈ విధంగా తొలిఏకాదశి పండుగను హిందువులు ఎంతో భక్తి భావంతో జరుపుకుంటారు.