మంత్రి హరీశ్ హామీ ఇచ్చినా నెరవేరలే

మంత్రి హరీశ్ హామీ ఇచ్చినా నెరవేరలే
  • నెరవేరని ఆరోగ్య శాఖ మంత్రి హామీ
  • శాంక్షన్​చేసి ఏర్పాటు మరిచిన ప్రభుత్వం 
  • చికిత్స కోసం వందల కిలోమీటర్లు వెళ్తున్న పేషంట్లు
  • దూర భారంతో గోస పడుతున్నామని ఆవేదన
  • వెంటనే జిల్లాలో ఏర్పాటు చేయాలని విన్నపం


ఆసిఫాబాద్, వెలుగు :  ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రులలో రెండు నెలల్లో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు ఇచ్చిన హామీ ఐదు నెలలైనా నెరవేరలేదు. శాంక్షన్​లెటర్లు ఇచ్చి ఏర్పాటు మరిచిపోయారని  విమర్శలు వస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని కిడ్నీ బాధితులు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్ కు వెళ్లి  డయాలసిస్​ చేసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. 

నాలుగు నెలలైనా కదలిక లేదు..

మార్చి 4న జిల్లా కేంద్రంలోని అంకుశాపూర్​లో  మంత్రి హరీశ్ రావు 340 బెడ్స్ హాస్పిటల్​కు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఆస్పత్రులలో 2 నెలల్లోగా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక నుంచి ఇక్కడి మారు మూల ప్రాంతాల్లోని పేషంట్లు డయాలసిస్​ కోసం వందల కిలోమీటర్ల దూరం పోవాల్సిన  అవసరం లేదని చెప్పారు. స్థానికంగానే అధునాతన చికిత్స అందించేలా  చర్యలు తీసుకుంటామన్నారు.  కానీ ఐదు నెలలు దాటినా అధికారులు డయాలసిస్​ఏర్పాటు విషయమే మరిచిపోయారు. 

జీవో ఇచ్చిన్రు.. మరిచిన్రు..

 జిల్లాలో రెండు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు కోసం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జీవో ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. దీంతో అసలే వర్షాకాలం కావడంతో డయాలసిస్​ పేషంట్లు దూరప్రాంతాలకు వెళ్లేందుకు  గోస పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరదలకు రాకపోకలు నిలిచిపోవడం, రోడ్డు తెగిపోవడం ,వాగులు వంకలు  ఉప్పొంగడంతో రోగుల పరిస్థితి వర్ణణాతీతం. జిల్లాలో డయాలసిస్ ​కోసం 
వారం రోజుల పాటు వెళ్తున్న రోగులు కూడా ఉన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

డయాలసిస్ సెంటర్ దగ్గరైతే బాగుండు..

 నేను వారానికి రెండు సార్లు డయాలసిస్ చేసుకోవాలి. దగ్గరలో డయాలసిస్ సెంటర్ లేక బాగా అవస్థ పడుతున్న. మంచిర్యాల, గోదావరిఖని కి పోయి చేసుకుంటున్న.  కిరాయిల భారంతో పాటు అక్కడ కూడా సమయానికి టెక్నీషియన్లు అందుబాటులో ఉంటలేరు. డయాలసిస్ ​సమయానికి చేసుకోలేక ఒక్కోసారి ప్రాణం పోతుందేమోననిపిస్తోంది.  కాగజ్ నగర్ ల డయాలసిస్ సెంటర్ పెడితే బాగుండు.   – సామెరా సత్తయ్య, కల్వాడ, దహెగాంత్వరలో ఏర్పాటు చేస్తాం

జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లలో త్వరలోనే రెండు డయాలసిస్ సెంటర్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. జీవో వచ్చినా వర్షాల కారణంగా ఆలస్యం అయ్యింది.  ఇక్కడ సెంటర్లు ఏర్పాటు చేయడం ద్వారా మారు ప్రాంతాల్లోని పేషంట్లకు  ఇక్కడే ట్రిట్మెంట్ అందుతుంది. 
– ప్రభాకర్, డీఎంహెచ్​వో, ఆసిఫాబాద్