‘క్యాసినో’లో కేసీఆర్ ఫ్యామిలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

‘క్యాసినో’లో కేసీఆర్ ఫ్యామిలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • ఓట్ల శాతం 42 నుంచి 53 దాకా పెరుగుతది
  • ఢిల్లీలో కేసీఆర్ మూడు రోజులు ఏం చేసిండో చెప్పాలె
  • నయీం కూడా టీఆర్ఎస్ లీడరేనని ఆరోపణ
  • భువనగిరిలో మీడియాతో సంజయ్ చిట్‌‌చాట్ 

యాదాద్రి, వెలుగు: మునుగోడు తర్వాత రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ‘‘సీఎం కేసీఆర్ కుటుంబంపై అనేక ఆరోపణలు వస్తుండడంతో ఆయన మీద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నమ్మకం కోల్పోయారు. రెండ్రోజుల కిందట 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నరు. ఏదో విధంగా ప్రజల చేత ఒత్తిడి చేయించుకొనైనా సరే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు పోదామని అనుకుంటున్నరు. బుధవారం యాదాద్రి జిల్లా దేశ్​ముఖ్​లో గ్రామస్తులు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేను అడ్డుకుని రాజీనామాకు డిమాండ్​ చేయడం ఇందులో భాగమే. వీరి రాజీనామాలతో త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి” అని బండి సంజయ్ చెప్పారు. యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం ఆయన భువనగిరి శివారులో మీడియాతో చిట్‌‌చాట్ చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి బీజేపీలోఎప్పుడు చేరుతారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఆయన్నే అడిగి చెబుతానన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి కూడా బీజేపీలో చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రస్తావించగా.. ‘‘కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ మాదిరే వెంకట్‌‌‌‌రెడ్డి కూడా పోరాడుతున్నరు. ప్రధాని మోడీ నేతృత్వంలోని పాలనను పలుమార్లు ప్రశంసించారు. నియోజకవర్గ డెవలప్‌‌‌‌మెంట్ కోసం మోడీని, కేంద్రమంత్రులను కూడా ఆయన కలిశారు. మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీలో చేరే వారందరిని చేర్చుకుంటాం. టికెట్ విషయంలో మాత్రం గ్యారంటీ ఉండదు” అని చెప్పుకొచ్చారు.

దేశ్‌‌‌‌కీ నేత కాదు.. ఫామ్‌‌‌‌హౌస్ నేత
రెండు రోజుల కిందట వచ్చిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 62 సీట్లు వస్తాయని బండి సంజయ్ అన్నారు. ఓట్ల శాతం 42 నుంచి 53 శాతం దాకా పెరగనుందన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికలను చూస్తే ఓట్ల శాతం ఎలా పెరుగుతున్నదో తెలిసిపోతుందన్నారు. టీఆర్ఎస్‌‌‌‌కు నాలుగు ఎంపీ సీట్లు, 15 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్పారు. కేసీఆర్ దేశ్ కీ నేత కాదని, కేవలం ప్రగతిభవన్, ఫామ్‌‌‌‌హౌస్ నేత మాత్రమేనని విమర్శించారు. త్వరలో పాతబస్తీ సంగతి కూడా చూస్తామని చెప్పారు. ‘‘గ్యాంగ్‌‌‌‌స్టర్ నయీం కూడా టీఆర్ఎస్ సభ్యుడే. పేదలపై నయీం ఎన్ని దాడులు చేసినా, ఎంత చీకటి దందా చేసినా కేసీఆర్ స్పందించలే. ఎప్పుడైతే కేసీఆర్ కుటుంబంపై నయీం కామెంట్ చేశాడో.. అప్పుడే ఎన్​కౌంటర్ చేయించారు” అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే నయీం చీకటి వ్యవహారంపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నయీం ఆస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కొనుగోలు చేయొద్దని అన్నారు. 

ఢిల్లీకి బీఆర్ఎస్ కోసమా? వీఆర్ఎస్ కోసమా?

ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ మూడు రోజులు అక్కడేం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్కడికెళ్లింది బీఆర్ఎస్ కోసమా? లేక వీఆర్ఎస్ కోసమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన డ్రగ్స్, కిడ్నాప్, హత్యలు, ఆత్మహత్యలు, కబ్జాలతో పాటు చీకోటి క్యాసినో దందాలో కేసీఆర్ కుటుంబంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్ల హస్తం ఉందని ఆరోపించారు. ప్రవీణ్‌‌‌‌తో సంబంధం ఉన్న వాళ్లు చాలా మంది విదేశాలకు వెళ్లారని తెలిపారు. ఆస్తులు కాపాడుకోవడానికే మంత్రి మల్లారెడ్డి జోకర్ లెక్క యాక్టింగ్ చేస్తరని బండి విమర్శించారు. భూములు కబ్జా చేయడానికే ధరణి తెచ్చారని ఆరోపించారు. బీజేపీ దెబ్బకే.. చేనేత బీమా ప్రకటన చేశారని చెప్పారు. చేనేత బంధు అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆర్టీసీని ప్రైవేట్​ పరం చేసి,  విలువైన ఆస్తులను మాయం చేయడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అలా జరగకుండా అడ్డుకుంటామన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 2.70 లక్షల ఇండ్లు రాష్ట్రానికి వస్తే 8 వేల ఇండ్లు మాత్రమే కట్టిచ్చారని విమర్శించారు.