ఈ సారి రాకపోతే జైలుకే: దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు సీరియస్

ఈ సారి రాకపోతే జైలుకే: దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు సీరియస్

హైదరాబాద్: దగ్గుబాటి ఫ్యామిలీపై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారని మండిపడింది. సెలబ్రిటీలకు అయితే ఒక న్యాయం.. సామాన్యులకైతే మరో న్యాయమా అని వ్యాఖ్యానించిన కోర్టు.. చట్టం నుంచి ఎన్నిసార్లు తప్పించుకు తిరుగుతారని నిలదీసింది. 2026, ఫిబ్రవరి 5వ తేదీన  కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని దగ్గుబాటి బ్రదర్స్‎ను ఆదేశించింది. లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. 

అసలు కేసు ఏంటంటే..? 

2022 నవంబరులో జీహెచ్ ఎంసీ సిబ్బంది, దగ్గుబాటి ఫ్యామిలీ బౌన్సర్లతో కలిసి జూబ్లీహిల్స్‎లోని దక్కన్ కిచెన్ హోటల్‎ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు నందకుమార్ అప్పట్లో ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించాడు. కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో హోటల్‏పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్ట్ ఆర్డర్స్ లెక్కచెయ్యకుండా 2024 జనవరిలో దక్కన్ హోటల్‎ను పూర్తిగా కూల్చి వేశారు. 

దీంతో మరోసారి తనకి న్యాయం చెయ్యాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. ఈ పిటిషన్‎ను విచారించిన కోర్టు హోటల్ విషయంలో హైకోర్టు ఆర్డర్స్ లెక్కచెయ్యని దగ్గుబాటి కుటుంబంలోని వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ తదితరులపై కేసు నమోదు చెయ్యాలని ఫిలిం నగర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు దగ్గుబాటి బ్రదర్స్‎పై ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read : రాజా సాబ్తో చరిత్ర సృష్టించిన ప్రభాస్

ప్రస్తుతం కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది. 2026, జనవరి 9వ తేదీన విచారణ జరగగా దగ్గుబాటి సురేశ్, దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రానా నాంపల్లి కోర్టుకు అటెండ్ కాలేదు. హాజరుకు మినహాయింపు ఇవ్వాలని హైకోర్టులో దగ్గుబాటి కుటుంబం తరఫు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్‎ను న్యాయస్థానం తోసిపుచ్చింది. 2026, జనవరి 23న తప్పనిసరిగా నాంపల్లి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

 అయితే.. వ్యక్తిగత కారణాలతో శుక్రవారం (జనవరి 23) కూడా దగ్గుబాటి బ్రదర్స్ కోర్టుకు రాలేదు. దీంతో  దగ్గుబాటి సోదరులపై నాంపల్లి కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తారని మండిపడింది. 2026, ఫిబ్రవరి 5వ తేదీన  కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని దగ్గుబాటి బ్రదర్స్‎ను ఆదేశించింది. లేదంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.