
- ఆరు కిలోల సన్నబియ్యంతో పాటు బ్యాగ్!!
- అక్టోబర్ కోటాతో ఇవ్వాలని భావించిన సర్కారు
- సంచులపై 3 రంగులు, సీఎం, మంత్రి ఉత్తమ్ ఫొటోలు
- ఆరు గ్యారెంటీల వివరాలనూ చేర్చిన సర్కారు
- రేషన్ షాపుల వరకు చేరుకున్న బస్తాలు
- స్థానిక ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా?
హైదరాబాద్ : రేషన్ షాపుల్లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పంపిన సరుకుల సంచులకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. అక్టోబర్ నెల సన్నబియ్యం కోటాతో పాటు ఈ సంచులను ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఈ సంచులపై మూడు రంగులతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలను ముద్రించారు. మరో వైపు ప్రభుత్వం ఇస్తున్న ఆరు గ్యారెంటీల వివరాలను పొందుపర్చారు.
ఆరు కిలోల బియ్యం పట్టే విధానంగా రూపొందించిన ఆ సంచులను లబ్ధిదారులకు అక్టోబర్ నెల బియ్యంతోపాటు అందించేందుకు సర్కార్ కసరత్తు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమానికి వాయిదా పడింది. ఈ సంచులను మల్టీపర్పస్ వినియోగించుకునేలా రూపొందించింది. ప్లాస్టిక్ వినియోగం
తగ్గించేలా పర్యావరణహితంగా, ఎక్కువ రోజులు ఉపయోగించుకునేలా మన్నికతో తయారు చేశారు. వీటి ద్వారా కేవలం రేషన్ బియ్యమే కాకుండా కూరగాయలు, సరుకులు, ఇతర వస్తువుల రవాణాకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఈ సంచులను రెడీ చేసింది.
వీటిని జిల్లా కేంద్రాల ద్వారా మండల్ లెవల్ స్టాక్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు చేర్చింది. అయితే స్థానిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో వాటి పంపిణీ నిలిచిపోయింది. ప్రస్తుతం రేషన్ షాపుల్లో యథాలాపంగా కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ప్రస్తుతం డీలర్ల దగ్గర ఉన్న సంచులను తిరిగి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేర్చాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అంటే నవంబర్ 11 తర్వాత ఇస్తారా..? లేదా డిసెంబర్ కోటాతో పంపిణీ చేస్తారా..? అన్నది తేలాల్సి ఉంది.