ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని మేం చెప్పినమా?.. సర్కారును నిలదీసిన హైకోర్టు

ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆపాలని మేం చెప్పినమా?.. సర్కారును నిలదీసిన హైకోర్టు

ధరణి పోర్టల్‌తో సంబంధం లేకుండా చేసుకోవచ్చుగా

డేటా సేఫ్టీకి చట్ట భద్రత ఏది?

వెబ్ సైట్ లోని డేటా సేఫ్టీపై హామీ కాదు.. చట్ట భద్రత ఏది?
వెబ్ సైట్ వివరాల్లేకుంటే అమ్ముడు కొనుడు కుదరదా?
అట్లని ఏ చట్టం కింద చెప్పిన్రు?

కేంద్ర సర్కారు వివరాలే హ్యాకయింది తెల్వదా?

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని తామేమీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చెప్పింది. పోర్టల్‌తో సంబంధం లేకుండా పాత విధానంలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చంది. ధరణి వెబ్‌ పోర్టల్‌లో ఆస్తుల నమోదు పేరుతో తీసుకున్న ఆధార్, ఫోన్‌ నంబర్, కులం లాంటి పర్సనల్‌ ఇన్ఫర్మేషన్‌పై భద్రత ఎట్ల కల్పిస్తున్నరో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భద్రత ఉందని ప్రభుత్వం మాటగా చెబితే చాలదని, చట్ట ప్రకారం ఏం భద్రత ఉందని అడిగింది. ధరణి వెబ్‌ పోర్టల్‌ పద్ధతిలో వ్యవసాయేతర వివరాల నమోదు చేయరాదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్ని మరోసారి పొడిగింది. కేసులో వెలువడే తుది తీర్పుకు అనుగుణంగా అవసరమైతే ఆధార్‌, ఇతర వివరాల్ని ప్రభుత్వం సేకరించుకోవచ్చంది. విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.

కేంద్రం వివరాలే హ్యాకయింది తెల్వదా?

ధరణి పోర్టల్‌లో వ్యక్తిగత వివరాల నమోదు చేయాలన్న ప్రభుత్వ ప్రకటనను సవాల్‌ చేస్తూ న్యాయవాదులు ఐ. గోపాల్‌శర్మ, కె. సాకేత్‌, ఇతరులు వేసిన పిల్స్​ను చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిల డివిజన్‌ బెంచ్‌ మంగళవారం మరోసారి విచారించింది. ‘చట్టం చేయకుండా ఆధార్, వేరే వివరాల్ని ఎలా నమోదు చేస్తున్నరు? నమోదు చేశాక ఆ వివరాలు హ్యాక్‌ కావని గ్యారంటీ ఎవరిస్తరు? కేంద్రం వివరాలు, వైట్‌ హౌస్, బకింగ్‌హ్యామ్‌ ప్యాలెస్‌ వివరాలు గతంలో హ్యాక్‌ అయ్యాయని తెలియదా? ఇవన్నీ తెలిసినపుడు చట్టం చేయకుండా వ్యక్తిగత వివరాల్ని ఎట్ల నమోదు చేస్తరు? వెబ్‌సైట్‌లో నమోదు చేసే వివరాల భద్రతపై భరోసా ఏందో తేల్చకుండా ఎలా ఆమోదించాలి?’ అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. డిజిటలైజేషన్‌ వల్ల ప్రజలకు మేలే జరుగుతుందని, కానీ అది చట్ట ప్రకారం లేకపోతే ఎట్లని నిలదీసింది.

ఆధార్‌ వివరాలు ఇష్టానుసారం నమోదు చేయొద్దని సుప్రీం చెప్పిందిగా

ఆధార్‌ వివరాల్ని ఇష్టానుసారంగా నమోదు చేయరాదని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది. ధరణిలో వివరాలు నమోదు చేసుకోకపోతే ఇకపై ఆస్తుల క్రయవిక్రయాలకు వీలుండదని ఏ చట్ట నిబంధన కింద ప్రభుత్వం చెబుతోందో వివరణ ఇవ్వట్లేదని ఆక్షేపించింది. వివరాల్ని నమోదు చేయకపోతే ఆస్తుల బదలాయింపు, ఆస్తులకు వారసత్వ హక్కులు ఉండవని చెప్పడం రాజ్యాంగంలోని ‘300 ఎ’ ఆర్టికల్‌కు విరుద్ధమన్న పిటిషనర్ల వాదనపై ఎందుకు స్పందించడం లేదంది. చట్టం లేకుండా ఆధార్, కులం, కుటుంబీకుల వివరాల్ని నమోదు చేయడం చెల్లదని.. ఇది పుట్టుస్వామి కేసులో సుప్రీం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకమని పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. పంచాయతీ, మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీ పరిధిలో మ్యూటేషన్‌ చేసేందుకు ప్రభుత్వం 231, 227, 57 జీవోలు జారీ చేయడాన్ని కూడా తప్పుబట్టారు. ఆ జీవోల అమలును సవాల్‌ చేస్తూ అనుబంధ పిటిషన్లు వేశామన్నారు.

పిటిషన్​ ప్రభుత్వ వ్యతిరేకమని ఎట్ల చెప్తరు?

హైకోర్టు స్టే వల్ల వ్యవసాయేతర ఆస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని.. స్టే ఎత్తేయాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. ఇప్పటికే 80 మంది తమ వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేసుకున్నారంటే జనం ఆమోదం ఉన్నట్లేనని చెప్పారు. ధరణిలో నమోదు చేసుకున్న వివరాలు ఎవరికీ కనబడకుండా భద్రత చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్పందించిన కోర్టు.. ధరణి వెబ్‌ పోర్టల్‌కు పూర్వం ఉన్నట్టు తాత్కాలిక విధానంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని చెప్పింది. ధరణి పోర్టల్‌ విధానంలో రిజిస్ట్రేషన్లు చేయరాదని తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామంది. వ్యాజ్యం ప్రభుత్వ వ్యతిరేకమని ఎట్ల చెబుతారని.. ప్రజల మేలు కోసం రాజ్యాంగ, న్యాయ పరమైన హక్కుల కోసం వేసిందని ఎందుకు భావించొద్దని ప్రశ్నించింది. ఆస్తుల వివరాలను భయంతో జనం నమోదు చేసుకుంటే చట్టబద్ధత, ప్రజామోదం ఎట్లవుతుందని అడిగింది. ధరణిలో వివరాలు కనబడకపోవడం వేరని.. అవి లీక్‌, హ్యాక్‌ అవవని చట్ట ప్రకారం ఉన్న హామీ ఏంటో చెప్పాలంది.