
- స్థానిక సంస్థల ఎన్నికలకుకేడర్ను సిద్ధం చేయండి
- పది ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్‌లను ఆదేశించిన మీనాక్షి నటరాజన్
- కష్టపడినవాళ్లకే పదవులివ్వాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ కమిటీల నియామకం పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జ్‌లను రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. పది ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్‌లతో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూమ్‌లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడారు. ‘‘త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు వెంటనే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నియామకాలు పూర్తి చేయాలి.
పార్టీ కోసం పనిచేసే వారిని, జనంలో నిత్యం తిరిగే వారిని, గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి వారికి ఈ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో సామాజిక సమీకరణలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ కమిటీలో తగిన గుర్తింపు ఇవ్వాలి. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించొద్దు. పాత, కొత్త వారికి చోటు కల్పించాలి. వారిని సమన్వయం చేసుకుంటూ కమిటీలను ఏర్పాటు చేయాలి’’అని మీనాక్షి నటరాజన్ సూచించారు.
సమావేశం అనంతరం ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ ల జాబితాను మహేశ్ కుమార్ గౌడ్ మీడియాకు విడుదల చేశారు. ఖమ్మం జిల్లాకు సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి, నల్గొండకు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, వరంగల్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మెదక్ కు మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహబూబ్ నగర్ కు పీఏసీ మెంబర్ కుసుమ కుమార్, ఆదిలాబాద్ కు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కరీంనగర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నిజామాబాద్ కు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మత్ హుస్సేన్, రంగారెడ్డికి శాట్ చైర్మన్ శివసేనా రెడ్డిను నియమించారు.