
కరీంనగర్ క్రైం,వెలుగు: పోలీసుల్లో మరింత వృత్తి నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించేందుకే పోలీసు డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ నెలలో పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా రాష్ట్ర రెండో పోలీస్ డ్యూటీ మీట్ వరంగల్ లో నిర్వహిస్తునందున్న.. రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలోని కరీంనగర్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల పోలీస్ అధికారులు , సిబ్బందికి పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేర దర్యాప్తు, విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సైంటిఫిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్, సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకునేందుకు, వృత్తిపరమైన పనితీరు సామర్థ్యం మెరుగుదలకు డ్యూటీ మీట్ దోహదపడుతుందని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జోన్ తరఫున జాతీయ పోలీస్ డ్యూటీ మీట్లలో రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించి కరీంనగర్ కమిషనరేట్ కు, రాజన్న జోన్ కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీ లు శ్రీనివాస్ ,విజయ్ కుమార్, వాసాల సతీశ్, వేణుగోపాల్, యాదగిరి స్వామి, రంగనాయక్, సిబ్బంది పాల్గొన్నారు.