
- ఈ ఏడాది టాప్ 8 సిటీల్లో 9 కోట్ల చదరపు అడుగులు దాటుతుందని అంచనా
- జీసీసీల నుంచే ఎక్కువ గిరాకి
- ఈ ఏడాది జనవరి–జూన్‌లో 4.17 కోట్లకు చేరుకున్న ఆఫీస్ స్పేస్ లీజ్
- హైదరాబాద్‌లో 6 శాతం తగ్గి 43 లక్షల చదరపు అడుగులకు: కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: భారత్‌లోని టాప్ 8 నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఈ ఏడాది 9 కోట్ల చదరపు అడుగులను దాటుతుందని, గత ఏడాది రికార్డును అధిగమిస్తుందని రియల్‌ఎస్టేట్ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. కరోనా మహమ్మారి తర్వాత నుంచి ఆఫీస్ మార్కెట్ పుంజుకుంటోందని తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది జనవరి–- జూన్ (మొదటి ఆరు నెలల్లో) టాప్ 8 నగరాల్లో 4.17 కోట్ల చదరపు అడుగులను డెవలపర్లు లీజ్‌కు ఇచ్చారు. గతేడాది నమోదైన 4.1 కోట్ల చదరపు అడుగుల (చ.అ.)తో పోలిస్తే కొద్దిగా ఎక్కువ. పుణె, చెన్నై, ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లో లీజింగ్ పెరిగింది. కానీ హైదరాబాద్, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతాలో తగ్గింది.
నగరాల వారీగా ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఇలా..
ఈ ఏడాది జనవరి–జూన్‌లో ముంబైలో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఏడాది లెక్కన 7శాతం తగ్గి 82 లక్షల చదరపు అడుగులకు, బెంగళూరులో 20శాతం తగ్గి 98 లక్షల చదరపు అడుగులకు పడింది. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 6శాతం తగ్గి 43 లక్షల చదరపు అడుగులుగా ఉంది. కోల్‌కతాలో 22శాతం తగ్గి 8 లక్షల చదరపు అడుగులగా, అహ్మదాబాద్‌లో 33శాతం తగ్గి 2 లక్షల చదరపు అడుగులగా రికార్డ్ అయ్యింది.
ఢిల్లీ- ఎన్‌సీఆర్‌లో 14శాతం పెరిగి 74 లక్షల చదరపు అడుగులకు, చెన్నైలో 22శాతం పెరిగి 41 లక్షల చదరపు అడుగులకు చేరింది. పుణెలో 67శాతం గ్రోత్ నమోదైంది. 68 లక్షల చదరపు అడుగులగా నమోదైంది.
ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోందని, ఎంఎన్‌సీలు కమర్షియల్ రియల్ ఎస్టేట్ డిమాండ్‌ను పెంచుతున్నాయని ఎనలిస్టులు చెప్పారు.
చివరి ఆరు నెలల్లో మరింత దూకుడు
కుష్మన్ అండ్ వేక్‌ఫీల్డ్ సీఈఓ అన్షుల్ జైన్ మాట్లాడుతూ, ‘‘ఆఫీస్ మార్కెట్‌లో భారత్ దూసుకుపోతోంది. టెక్నాలజీ, ఫైనాన్షియల్, ఇంజనీరింగ్ రంగాల నుంచి డిమాండ్ ఉంటోంది”అని అన్నారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో నమోదైన మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో 27 శాతం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీల) ద్వారా జరిగింది. దేశీయ కంపెనీలు, కో-వర్కింగ్ ఆపరేటర్లు కూడా డిమాండ్‌ను పెంచాయి.
ద్రవ్యోల్బణం తగ్గడం, రేట్ కట్స్, పెట్టుబడులను ఇండియా ఆకర్షిస్తుండడంతో ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ కొనసాగుతుందని జైన్ అభిప్రాయపడ్డారు. కొత్త గ్లోబల్ కంపెనీలు, జీసీసీల విస్తరణ వృద్ధికి సాయపడతాయన్నారు. కానీ కొన్ని కీలక లొకేషన్లలో సప్లయ్ తక్కువగా ఉందన్నారు.