
న్యూఢిల్లీ: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్), బ్లాక్రాక్ మధ్య 50:50 జాయింట్ వెంచర్ అయిన జియో బ్లాక్‌రాక్ అసెట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తన తొలి న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ద్వారా రూ.17,800 కోట్లు సేకరించినట్టు ప్రకటించింది. జియో బ్లాక్‌రాక్ ఓవర్‌నైట్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ లిక్విడ్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ మనీ మార్కెట్ ఫండ్ ద్వారా ఈ డబ్బును సమీకరించారు.
గత నెల 30న మొదలైన మూడు రోజుల ఎన్ఎఫ్ఓ, 90కిపైగా సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడులను ఆకర్షించింది. క్యాష్/డెట్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు రిటైల్ పెట్టుబడిదారుల నుంచి అద్భుత స్పందన వచ్చిందని జియో బ్లాక్రాక్ తెలిపింది. ఆఫర్ కాలంలో 67 వేల మందికిపైగా ఈ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టారని పేర్కొంది.