ఈ రోజుల్లో పక్కన ఉన్నవాళ్లు తిట్టినా, కొట్టినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. పొరపాటున ఒక్కసారి గట్టిగా తుమ్మితే మాత్రం, మొఖం మీదే తిట్టినంత పని చేస్తున్నారు. చుట్టుపక్కల వాళ్లు ఎక్కడ ఏమనుకుంటారోనని చాలా మంది సమాజంలో నలుగురిలో ఉన్నప్పుడు వచ్చే తుమ్మును బలవంతంగా లోపలే ఆపేసుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే చేశారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే!
తుమ్ము అనేది ఒక సహజమైన ప్రక్రియ. దాన్ని బలవంతంగా ఆపడం వల్ల ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అసలు తుమ్ము ఎందుకు వస్తుంది? దాన్ని ఆపితే మన శరీరంలో ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం...
అసలు తుమ్ము ఎందుకొస్తుందంటే... ముక్కులో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా వంటివి ముక్కులోకి ప్రవేశిస్తే... తుమ్ముతో, ముక్కు దాన్ని బలవంతంగా బయటకు పంపేస్తుంది. తుమ్మును ఆపేస్తే ఆ బ్యాక్టీరియా లేదా వైరస్ ముక్కులోనే ఉండిపోతుంది. కాసేపటి తర్వాతైనా మళ్లీ దాన్ని బయటకు పంపేందుకు తుమ్ము వస్తుంది. అప్పుడు కూడా ఆపితే.. ఆ బ్యాక్టీరియా శరీరంలోపలికి వెళ్లిపోతుంది.
బలవంతంగా ఆపొద్దు
తుమ్మును బలవంతంగా ఆపేస్తే... చెవిలోని డయాఫ్రమ్ దెబ్బతింటుంది. దీనివల్ల చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే... కంట్లోని రక్త నాళాలు దెబ్బతింటాయి. కంట్లోని తెల్ల పొరపై ఐరిస్ చుట్టూ ఉన్న రక్తనాళాలు బ్రేక్ అవుతాయి. బ్రెయిన్లోని రక్త నాళాలు బలహీనపడతాయి. సైనస్ సర్జరీ చేయించుకున్న వాళ్లు తుమ్ములను అస్సలు ఆపకూడదు. అలా చేస్తే... విపరీతమైన తలనొప్పి, ఒక్కోసారి గుండె నొప్పి కూడా రావొచ్చంటున్నారు డాక్టర్లు..
ఇప్పటికీ మిస్టరీనే!
అసలు తుమ్ము అనేది ఇప్పటికీ డాక్టర్లకు పూర్తిగా అంతుబట్టని విషయమే. కొందరు ఎండలోకి వస్తే తుమ్ముతారు. కొందరికి హార్డ్ వర్క్ ఏదైనా చేసినప్పుడు వస్తుంది. ఇంకొందరేమో ఎక్కువగా తింటే తుమ్ముతారు. ఇలా తుమ్ముల్లో బోలెడు రకాలున్నాయి. ఎందుకొస్తే ఏంటి కానీ, తుమ్ము వచ్చినప్పుడు తుమ్మాల్సిందే. కాబట్టి తుమ్మేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ లేనివైపు, మోచేతిని ముక్కుకు అడ్డం పెట్టుకొని తుమ్మితే అవతలి వాళ్లకు ఇబ్బంది ఉండదు.
