"నూకలు ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉంటాం. నూకలు చెల్లితే పైకిపోతాం' అని నానుడి. అదే నిజమైతే.. ఏళ్లకు సరిపడా నూకలు (ఆహారం) కుప్పలు కుప్పలు పోగేసుకుంటాడు మనిషి! కానీ, ఎన్ని జయించినా... తన జీవితకాలాన్ని పొడిగించుకోలేకపోతున్నాడు. అసలు ఈ జీవితకాలం వెనకున్న రహస్యం ఏంటి? భూమిపై కోట్లాది జీవరాశులు ఉన్నాయి. వాటిలో కొన్ని.. నెలలే భూమిపై ఉండి ప్రాణాలు విడిస్తే.. మరికొన్ని ఏళ్లకు ఏళ్లు ప్రాణాలతో తిరుగుతాయి. కొన్ని ఎక్కువ, కొన్ని తక్కువ ఎందుకు బతుకుతాయి? అసలు వయసు ఎందుకు పెరుగుతుంది? చావు ఎందుకొస్తుంది? ఇలాంటి ప్రశ్నలు మనిషికి తెలివి పుట్టినప్పుడే.. పుట్టాయి !
అరిస్టాటిల్ వివరణ...
జీవుల జీవితకాలం గురించి ప్రపంచంలో మొదటిసారి మాట్లాడింది అరిస్టాటిల్. జీవి. పరిమాణం... దాని జీవితకాలానికి మధ్య ఉన్న సంబంధాన్ని క్రీస్తుపూర్వం 350లోనే ఆయన వివరించాడు. అలాగే, నిప్పుకి, జీవితకాలానికి సంబంధం ఉందన్నాదాయన మంటని తాకిన వాటిని ఎక్కువగా తినడం వల్ల మనిషి జీవితకాలం తగ్గుతుందని, ఎక్కువ ఉడికించిన ఆహారం తిన్నప్పుడు శక్తి వేగంగా ఖర్చవ్వడమే దీనికి కారణమని వివరించాడు. వయసు మీద పడటానికి ఏజింగ్), చావుకి.. ఈ రెండింటికీ డీహైడ్రేషన్తో సంబంధం ఉందని కూడా అరిస్టాటిల్ చెప్పాడు. అప్పట్లో ఆయన చెప్పింది ఎవరూ అంగీకరించలేదు. డీహైడ్రేషన్తో సంబంధం ఉంటుందనే విషయాన్ని మాత్రం తర్వాతి కాలంలో అంగీకరించారు!
రేట్ ఆఫ్ లివింగ్ థియరీ..
ఆ తర్వాత కాలంలో 'ఏజింగ్' 'చావు' కారణాలు వెతికే పరిశోధనలు ఎక్కువగా జరగలేదు. పారిశ్రామిక విప్లవం తర్వాత 19వ శతాబ్దంలో 'ఏజింగ్' గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టారు. దానిపై పరిశోధనలు కూడా చేశారు. చివరికి "శరీరం తీవ్రంగా అలిసిపోవడమే. ఏజింగ్ కి కారణం' అని వాళ్లు భావించారు. 1908 లో మాక్స్ రబ్నర్ అనే సైంటిస్ట్ జీవక్రియకు, జీవితకాలానికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలుసుకోవడానికి పంది, పిల్లి, ఆవు, గుర్రంతో పాటు మనిషిపై స్టడీ చేశాడు. అందులో పెద్ద జంతువులు ఎక్కవకాలం బతుకుతున్నట్టు ఆయన కనిపెట్టాడు.. మొత్తం జీవక్రియ రేటు ఆయా జంతువుల బరువు ఆకారానికి తగ్గట్టు పెరుగుతుందని... ఉదాహరణకు ఎక్కువ బరువున్న ఏనుగు కంటే... తక్కువ బరువున్న ఎలుకే ఎక్కువ శక్తిని ఉపయోగించుకుంటుందని ఆయన తేల్చాడు. అందుకే ఎలుక తొందరగా చనిపోతుందని చెప్పాడు. అంటే కణాలు ఖర్చుచేసే శక్తిపైనే జీవితకాలంఆధారపడి ఉంటుంది. ఇది మనుషుల్లో, జంతువుల్లోనూ ఒకే విధంగా ఉంటుందని చెప్పాడు. ఫైనల్ గా 'శక్తిని వేగంగా ఖర్చు చేయడం వల్లే ఆయా జీవులు తొందరగా మరణిస్తాయి' అని తన “రేట్ ఆఫ్ లివింగ్ థియరీ'లో వివరించాడు.
మేఫ్లయ్ : ఒకరోజు
సీతాకోకచిలుక: నాలుగు వారాలు
ఈగ: నాలుగు వారాలు
తూనీగ: నాలుగు నెలలు
తొండ ఊసరవెల్లి : 12 నెలలు
పెద్ద ఎలుక:12 నెలలు
చిట్టెలుక: 2 సంవత్సరాలు
సాలెపురుగు: 2 సంవత్సరాలు
కుందేలు: 8-10 సంవత్సరాలు
ఉడుత : 10 సంవత్సరాలు
బల్లి: 10 సంవత్సరాలు
పిల్లి: 12-15 సంవత్సరాలు
గుడ్లగూబ: 15 సంవత్సరాలు
సింహం :14-18 సంవత్సరాలు
కాకి : 15 సంవత్సరాలు
పులి: 18-20 సంవత్సరాలు
ఆవు: 25 సంవత్సరాలు
ఏనుగు: 50-70 సంవత్సరాలు
మనిషి: 100 సంవత్సరాలు
చిలుక: 80-140 సంవత్సరాలు
నత్త : 150-200 సంవత్సరాలు
వేల్స్ : 200 సంవత్సరాలు
తాబేలు:140-300 సంవత్సరాలు
గ్రీన్ లాండ్ షార్క్:272-512 సంవత్సరాలు
జీన్స్ నిర్మాణం కూడా
1922లో అమెరికన్ బయాలజిస్ట్ రేమండ్ పెరల్అదే విషయం పైన రీసెర్చ్ చేసి "ది బయాలజీ ఆఫ్ 'డెత్' అనే పుస్తకం రాశాడు. 'జెనెటికల్ నిర్మాణం, శరీరంలో ఎంత మొత్తంలో శక్తి ఖర్చు అయింది (రేట్ ఆఫ్ ఎనర్జీ ఎక్స పెండీచర్)' ఈ రెండు అంశాలపై జీవితకాలం ఆధారపడి ఉంటుందని పెరల్ చెప్పాడు. ఈ స్టడీలో ప్రమాదాలని ఆయన లెక్కలోకి తీసుకోలేదు. 45
ఏళ్ల తర్వాత చనిపోయిన వాళ్లపై ఆయన స్టడీ చేశాడు. మరణానికి ముందు వాళ్లు ఖర్చు చేసిన శక్తిని, వాళ్లు చేసిన ఉద్యోగాన్ని, జీన్స్ నిర్మాణం పరిగణనలోకి తీసుకొని ఈ రీసెర్చ్ కంప్లీట్ చేసి జీన్స్ నిర్మాణం, రేట్ ఆఫ్ ఎనర్జీ ఎక్సపెండీచర్ కారణమని రాశాడు. అయితే, ఇటీవల పక్షులపై చేసిన పరిశోధనల ప్రకారం ఈ సిద్ధాంతంపై కొన్ని సందేహలు తలెత్తాయి. పక్షుల్లో శక్తి ఖర్చు 'టిష్యూ పర్ గ్రామ్' సగటున చూసినప్పుడు పాలిచ్చే వాటికంటే ఎక్కువగా ఉంది. అయినా అవి పాలిచ్చే జంతువుల కంటే ఎక్కువ కాలం బతుకుతున్నాయి!
బిలియన్ హార్ట్ బీట్స్..
ఒక జీవి జీవితకాలం దాని హార్ట్ బీట్ రేట్ మీద కూడా ఆధారపడి ఉంటుందని కొంతమంది బయాలజిస్టులు కనుగొన్నారు. హార్ట్ బీట్స్ బిలియన్ (వందకోట్లు) పూర్తయిన వెంటనే ఆ జీవి చనిపోతుందని వాళ్లు అంచనా వేశారు. ఎలుక కంటే ఏనుగు ఎక్కువకాలం బతుకుతుంది. ఎందుకంటే.. ఏనుగు హార్ట్ బీట్ ఎలుక కంటే స్లోగా ఉంటుంది. అంటే వందకోట్లసార్లు దాని గుండె కొట్టుకోవడానికి ఎక్కువ టైమ్ పడుతుందన్నమాట! అలాగే, ఎలుక జీవక్రియ రేటు కూడా ఏనుగుకంటే ఎక్కువగా ఉంటుంది.
ట్విస్టు..
ఏజింగ్, జీవితకాలంపై ఇలా చాలా సిద్ధాంతాలు వచ్చాయి. అయితే, అవి కొన్ని జీవులకే వర్తిస్తోంది. పైన చెప్పిన విషయాలతో సంబంధం లేకుండానే.. కొన్ని జీవులు ఎక్కువకాలం జీవిస్తున్నాయి. ఎక్కువ బరువు, పెద్ద ఆకారం ఉన్న జీవుల కంటే తాబేలు లాంటి చిన్న సైజ్ జీవులు కూడా ఎక్కువ కాలం జీవిస్తున్నాయి. కాబట్టి, ఏజింగ్, జీవితకాలంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
