
హైదరాబాద్, వెలుగు:ప్రైవేటు హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ సేవలు నాలుగో రోజూ బందయ్యాయి. బకాయిల విషయంలో ప్రభుత్వం, నెట్‌వర్క్ ఆస్పత్రుల మధ్య సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. హస్పిటళ్ల వారీ బకాయిల వివరాలను నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్(తన్హా)కు ప్రభుత్వం ఇవ్వగా అసోసియేషన్ వాటిని సమీక్షిస్తోంది. దీంతో సోమవారం జరగాల్సిన తన్హా అత్యవసర సమావేశం మంగళవారానికి వాయిదా పడింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 236 ప్రైవేటు హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీకి సంబంధించి 344 కోట్ల17 లక్షల 50 వేల 892 రూపాయల బకాయిలున్నాయి. ఈజేహెచ్‌ఎస్‌కు సంబంధించి 241 ప్రైవేటు హాస్పిటళ్లకు రూ.23 కోట్ల58 లక్షల 28 వేల 032 రూపాయలు, 15 కార్పొరేట్ ఆస్పత్రులకు (టీషా–తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్) 89 కోట్ల 99 లక్షల 90 వేల 072 రూపాయల బకాయిలున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కానీ సర్కారు లెక్కతో తమ లెక్కలు సరిపోలట్లేదని తన్హా ప్రతినిధులు చెబుతున్నారు. తన్హాలోని అన్ని ఆస్పత్రుల నుంచి బకాయిల లెక్కలు తెప్పిస్తున్నామని, వాటిని సరిచూసి మంగళవారం సర్కారుకు వివరిస్తామని అసోసియేషన్ ప్రతినిధి సురేశ్‌రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు సోమవారం రోగుల సంఖ్య పెరిగింది. గాంధీలో ఓపీ కోసం సాధారణం కన్నా వెయ్యి మంది ఎక్కువ వచ్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.