ఫార్వర్డ్ బ్లాక్​లో విభేదాలు..అభ్యర్థుల ఎంపికలో బయటపడ్డ లుకలుకలు

ఫార్వర్డ్ బ్లాక్​లో విభేదాలు..అభ్యర్థుల ఎంపికలో బయటపడ్డ లుకలుకలు

హైదరాబాద్, వెలుగు: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్​బీ)లో విభేదాలు బయటపడ్డాయి. ఇటీవలే ఆ పార్టీలో చేరిన కటకం మృత్యుంజయంను ఎన్నికల కమిటీ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించారు. పార్టీ విధివిధానాలకు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకునున్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల​గుర్తు ‘సింహాం’కు మంచి ఆదరణ ఉన్నది. ఇతర పార్టీల్లో సీట్లు రాని చాలామంది ఆ పార్టీ సింబల్ పై పోటీ చేసేందుకు పోటీపడుతుంటారు. నెలరోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం బీజేపీకి రాజీనామా చేసి, ఫార్వర్డ్ బ్లాక్ లో చేరారు. కటకం సీనియర్ నేత కావడంతో ఆయనకు ఎన్నికల కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు.

అయితే, ఆ బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి పార్టీకి సంబంధం లేకుండానే పర్యటనలు చేస్తున్నారని, పలు సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రకటిస్తున్నారని పార్టీ నేతలు ఫార్వర్డ్ బ్లాక్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో రెండ్రోజుల క్రితం అత్యవసరంగా హైదరాబాద్​లో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశమైంది. పార్టీతో సంబంధం లేకుండా కటకం ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో కేడర్​లో తీవ్ర అయోమయం నెలకొన్నదని మీటింగ్ లో అభిప్రాయం వ్యక్తం చేశారు. నల్గొండలో ఓ అభ్యర్థికి ఇప్పటికే పార్టీ బీఫామ్ ఇవ్వగా, బీఎస్పీ నుంచి వచ్చిన మరో వ్యక్తికి టికెట్ ఇస్తామంటూ ప్రకటన చేశారనీ మీటింగ్​లో చర్చించారు. ఈ నేపథ్యంలో ఆయనను ఎన్నికల కమిటీ చైర్మన్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండా సురేందర్ రెడ్డి ప్రకటించారు. దీంతోపాటు అపోహలకు తావివొద్దని ఎన్నికల కమిటీని రద్దు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలన్నీ రాష్ట్ర కమిటీకే అప్పగించినట్టు పేర్కొన్నారు. అయితే ఫార్వర్డ్ బ్లాక్ నిర్ణయంపై కటకం మృత్యుంజయం స్పందించలేదు.