- మరోవైపు భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- 9 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన టెంపరేచర్లు
- వచ్చే ఐదు రోజులు ఎండలు, వడగండ్లు, వర్షాలు పడతాయన్న ఐఎండీ
- వచ్చే నెల 3 నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వాతావరణం ఎండావానల కలబోతగా ఉంటున్నది. ఎండా కాలం ప్రారంభమై దాదాపు నెల అవుతున్నది. అయితే, మార్చి రెండో వారం వరకు రాష్ట్రంలో ఎండల ప్రభావం అంతగా లేదు. పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు పడ్డాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం పూట ఎండ సెగ తీవ్రంగా ఉంటున్నా.. సాయంత్రం నాలుగైదు గంటల నుంచి వాతావరణం మారుతున్నది. చల్లగా మారి.. వడగండ్ల వర్షం పడుతున్నది. మొన్నటిదాకా ఉష్ణోగ్రతలు కంట్రోల్‌లోనే ఉండగా, ప్రస్తుతం టెంపరేచర్లు పెరగడంతో పాటు వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరికొన్ని జిల్లాల్లో కూడా అంతేస్థాయిలో టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 40.6 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా మాచర్లలో 40.4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కర్కగూడెంలో 40.3, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 40.3, నల్గొండ జిల్లా ఘనపూర్‌లో 40.2, ములుగు జిల్లా ధర్మవరంలో 40.1, జగిత్యాల జిల్లా ఐలాపూర్, హనుమకొండ జిల్లా నడికుడ, ఖమ్మం జిల్లా పమ్మిలో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 14 జిల్లాల్లో 39 డిగ్రీల నుంచి 39.6 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ 38.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
ఐదు రోజులు వర్షాలు.. ఎండలు..
రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండలతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. వడగండ్లు పడే ప్రమాదం కూడా ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. తొలి రెండ్రోజుల పాటు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుందని, ఆ తర్వాత తూర్పు, దక్షిణ జిల్లాల్లో పడతాయని వెల్లడించింది. హైదరాబాద్ సిటీలోనూ సాయంత్రం పూట 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మోస్తరు వర్షాలు, వడగండ్లు పడతాయని తెలిపింది. ఇటు ఉష్ణోగ్రతల్లోనూ 3వ తేదీ నుంచి భారీ మార్పు ఉంటుందని, అత్యధికంగా 5 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
