ట్విట్టర్​లో కోతలు.. అమెరికాలో మన ఉద్యోగులకు కష్టాలు

ట్విట్టర్​లో కోతలు.. అమెరికాలో మన ఉద్యోగులకు కష్టాలు

న్యూఢిల్లీ: ట్విట్టర్ లో ఉద్యోగం కోల్పోయిన అమెరికాలోని మనోళ్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. హెచ్ 1బీ వీసాపై అక్కడ ఉంటున్న మనోళ్లు.. రెండు నెలల్లోగా కొత్త ఉద్యోగంలో చేరాలి. లేదంటే అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దీంతో ట్విట్టర్ లో ఉద్యోగం కోల్పోయిన మనోళ్లందరూ కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలోని కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ వీసా హెచ్ 1బీ కింద ఇతర దేశాల ఎంప్లాయీస్ ను తీసుకుంటాయి. ఈ వీసా కింద ఎక్కువ శాతం మన దేశం, చైనా వాళ్లే వెళ్తుంటారు. హెచ్-1బీ వీసాతో మూడేండ్ల పాటు అమెరికాలో ఉండొచ్చు. ఈ గడువు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఆరేండ్లకు మించి ఉండరాదు. అయితే చట్ట ప్రకారం.. ఉద్యోగం లేకుండా హెచ్ 1బీ వీసాపై అమెరికాలో ఉండడానికి వీల్లేదు. ఈ వీసా ఉండి ఉద్యోగం కోల్పోయినోళ్లు రెండు నెలల వరకు దేశంలో ఉండొచ్చు. అంతలోపు వేరే ఉద్యోగంలో చేరాలి. లేదంటే దేశం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ట్విట్టర్ లో మొత్తం 7,500 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో దాదాపు 670 మంది హెచ్ 1బీ వీసాదారులు ఉన్నారు. అయితే వీరిలో ఎంతమందిని కంపెనీ తొలగించిందనేది ఇంకా తెలియలేదు.  

ఒకే ఒక్క ఆప్షన్.. 
ఒకవేళ కొత్త జాబ్ దొరకకున్నా హెచ్ 1బీ వీసాదారులు అమెరికాలో ఉండేందుకు ఒక అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వాళ్లు బీ2 వీసాకు మారాలని సూచిస్తున్నారు. ఇది విజిటర్ వీసా. దీనిపై గరిష్టంగా 6 నెలలు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత కొన్ని నెలలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. ‘‘45 రోజుల్లోగా జాబ్ దొరక్కపోతే బీ2 వీసాకు అప్లై చేసుకోవాలి. దీంతో మాజీ ఉద్యోగులకు కొంత టైమ్ దొరుకుతుంది. అప్పుడు కొత్త జాబ్ చూసుకొని మళ్లీ హెచ్ 1బీకి మారిపోవచ్చు. అయితే బీ2 వీసాపై ఉద్యోగం చేసేందుకు అవకాశం లేదు. ఈ టైమ్​లో బతికేందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవాలి” అని యూఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ రాబర్ట్ సూచించారు. కాగా, మాజీ ఉద్యోగులు కొంద రు వర్సిటీల్లో అడ్మిషన్లకు ప్రయత్నిస్తున్నారు.