సొంత భవనం లేక విద్యార్థులకు తప్పని కష్టాలు

సొంత భవనం లేక విద్యార్థులకు తప్పని కష్టాలు
  • నాలుగేండ్లుగా ఆగిపోయిన ఇంటర్​ కాలేజీ బిల్డింగ్​ పనులు
  • మూడుసార్లు మారిన  ప్రభుత్వ జూనియర్​ కాలేజీ అడ్రస్​
  • ఏండ్లు  గడుస్తున్నా పట్టించుకోని పాలకులు
  • సొంత భవనం లేక విద్యార్థులకు తప్పని కష్టాలు

జీడిమెట్ల, వెలుగు:  సర్కార్​ బడుల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మంజూరైన  ఒకే ఒక్క ప్రభుత్వ ఇంటర్​ కాలేజీకి  సొంత బిల్డింగ్​ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.  బిల్డింగ్​ మంజూరైనా పనులు సగంలోనే ఆగిపోయాయి.  దీంతో  అద్దె భవనాల్లో  కాలేజీ నడుస్తోంది.  ఇప్పటికే మూడుసార్లు కాలేజీ బిల్డింగ్​ను మార్చాల్సి వచ్చింది. అయినా సొంత బిల్డింగ్​ పనులు పూర్తి చేయడంలో  అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు.  కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏటా సుమారు  10వేల మందికి పైగా విద్యార్థులు పది పూర్తి చేసి, ఇంటర్​కు వెళ్తున్నారు.  ఈ ఏరియా  ఇండస్ట్రియల్ఎస్టేట్ లో కార్మికుల పిల్లలు  ఎక్కువ ఉండడంతో.. వీళ్లకు ఈ కాలేజీ ఒక్కటే దిక్కు.  దీన్ని సరిగా పట్టించుకోకపోవడంతో  కార్మికులు తమ పిల్లల్ని  ప్రైవేటు కాలేజీలకు పంపే స్థోమత లేకపోవడంతో చదువుకు దూరం అవుతున్నారు.  కొంత మంది పిల్లలు కార్మికులుగా మారుతున్నారు. 

మూడు చోట్లకు మార్చగా.. 
కుత్బుల్లాపూర్​లోని  ప్రభుత్వ పాఠశాలలో ఐదేండ్ల కిందట కాలేజీని ప్రారంభించారు.  కేవలం రెండు గదుల్లో  ఇంటర్​ క్లాసులు  నిర్వహించారు.  స్కూల్, కాలేజీ విద్యార్థులకు  స్థలం చాలకపోవడంతో కాలేజీని  సూరారంలోని ఓ  భవనంలోకి మార్చారు.  కొంత కాలం తర్వాత అక్కడ నుంచి ఖాళీ చేయించారు. దీంతో  హెచ్ఎంటీకి చెందిన ఓ భవనంలోకి కాలేజీని మార్చారు. ఇప్పుడు అక్కడే నడుస్తోంది. అక్కడ కూడా ఖాళీ చేయాల్సి వస్తే.. పరిస్థితి ఏంటోనని విద్యార్థులు, స్టాఫ్​ ఆందోళన చెందుతున్నారు. 

నాలుగేండ్లుగా.. 
నాలుగేండ్ల కిందట కాలేజీ బిల్డింగ్ ​కోసం సూరారంలోని డాక్​ బంగ్లాలో స్థలం కేటాయించి శంకుస్థాపన చేశారు.  ఏడాదిలో బిల్డింగ్​ ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికీ పనులు మాత్రం పూర్తి కాలేదు.  కాంట్రాక్టర్​కు  డబ్బులు చెల్లించకపోవడంతో    పనులు ఆపేసినట్లు తెలిసింది.  దీంతో   భవనం అసాంఘీక పనులకు అడ్డాగా మారిపోయింది.  

ఎమ్మెల్యే మాట నిలబెట్టుకుంటారా?
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే  వివేకానంద్   ప్రభుత్వ పాఠశాలతో పాటు కాలేజీకి కోటి  చొప్పున నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. దీంతో  విద్యార్థుల తల్లిదండ్రుల్లో  ఆశనెలకొంది.  ఎమ్మెల్యే స్పందించి వెంటనే పనులు  పూర్తి చేయిస్తే ఈసారైనా కాలేజీ బిల్డింగ్  కొత్త  విద్యా సంవత్సరంలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తారని ఎదురు చూస్తున్నారు.    

విద్యపై నిర్లక్ష్యం తగదు
 మంచి భవనాలు, మౌలిక వసతులతో విద్యను అందిస్తే  విద్యార్థులు చదువు అబ్బుతుంది.  ఈ కాలేజీ బిల్డింగ్​ నాలుగేండ్లుగా పూర్తి కాకపోవడం విడ్డూరం.  అధికారులు, పాలకులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు నాణ్యమైన, ప్రశాంతమైన విద్యను అందించాలి. 
- ఈశ్వరయ్య , రిటైర్డ్ హెడ్​మాస్టర్​