దుబాయ్ లో సిరిసిల్ల, నిజామాబాద్​ యువకుల కష్టాలు

దుబాయ్ లో సిరిసిల్ల, నిజామాబాద్​ యువకుల కష్టాలు

ఇండియాకు రప్పించాలని వీడియో మెసేజ్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఏజెంట్​చేతిలో మోసపోయిన రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు దుబాయ్​లో చిక్కుకుపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన  గుగులోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన పెద్దోల్ల స్వామి, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గొల్లపల్లి రామస్వామి, చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన మారుపాక అనిల్, నిజామాబాద్ జిల్లా మోపాల్​ మండలం నర్సింగపల్లి గ్రామానికి చెందిన నరేందర్​సిరిసిల్ల,  వేములవాడ, నిజామాబాద్ జిల్లా ఏజెంట్ల ద్వారా దుబాయ్​లోని ఓ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆరు నెలల క్రితం దుబాయ్​వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఇండియాలో చెప్పిన పని కాకుండా వేరే పని చేయించడం, జీతం కూడా చెప్పినంత ఇవ్వకపోవడంతో కంపెనీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులను పిలిపించి తాగి న్యూసెన్స్ చేస్తున్నారని కేసులు బుక్ చేయించారు. అయినా యువకులు వినకపోవడంతో ఫ్లైట్​టికెట్ ఉంటే ఇండియాకు పంపిస్తామని చెప్పారు. దీంతో  ఐదుగురు యువకులు ఇండియాలో ఉన్న కుటుంబసభ్యులతో మాట్లాడి టికెట్లు తెప్పించుకున్నారు. కంపెనీ వాళ్లు పాస్​పోర్టులు ఇచ్చి ఐదుగురిని శుక్రవారం ఎయిర్​పోర్ట్ దగ్గర వదిలేశారు. ఎయిర్​పోర్టులో పాస్​పోర్టులు చెక్​చేసిన పోలీసులు మీపై కేసులు ఉన్నాయని, దేశం వదిలి వెళ్లడానికి వీలు లేదని వెనక్కి పంపించారు. యువకులు ఏజెంట్లకు, కంపెనీకి ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు  విషయం తెలియజేశారు. మూడు రోజులుగా తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేదని.. చాలా ఇబ్బందులు పడుతున్నామని సోషల్​మీడియాలో వీడియో అప్​లోడ్​ చేశారు. మంత్రి కేటీఆర్​స్పందించి తమను ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు. స్పందించిన మంత్రి కేటీఆర్ యువకులు సమస్యను పరిష్కరించాలని కోరుతూ దుబాయ్ లో ఉన్న ఇండియన్ కాన్సులేట్ కు ట్వీట్ చేశారు.

నా కొడుకును రప్పించాలి

లక్ష రూపాయలు కట్టి నా కొడుకును దుబాయ్ పంపిన. ఆరు నెలల నుంచి పనిలేక అక్కడ అవస్థలు పడుతుండు. ఇక్కడికి వచ్చేందుకు 15 వేలు టికెట్ కోసం అప్పుజేసి పంపిన. అప్పులు ఎట్లనన్నా తెరుపుకుంటం. కానీ నా కొడుకును ఇండియాకు రప్పించాలే. 

 – పెద్దోల్ల దేవవ్వ