
ప్ర స్తుత డిజిటల్ యుగంలో స్క్రీన్‌లు మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయాయి. స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, టెలివిజన్‌లు తదితర పరికరాల వినియోగం వ్యక్తిగత జీవితం నుంచి వృత్తిపరమైన అవసరాల వరకు విస్తరించింది. సాంకేతికత ఆధునిక జీవనశైలికి అనేక సౌకర్యాలను అందించినా, దీని అధిక వినియోగం పలు దుష్ప్రభావాలకు దారితీస్తోంది.
మానసిక అలసట, ఒత్తిడి, నిద్రలేమి, శారీరక నొప్పులు, స్థూలకాయం వంటి సమస్యలు వేధిస్తున్నాయి. అంతేకాదు, స్క్రీన్‌లపై అధికంగా ఆసక్తి చూపడం వల్ల వ్యక్తిగత సంబంధాలు బలహీనమవుతుండటం, ఒంటరితనం, ఆందోళన, నిరాశ లాంటి మానసిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో 'డిజిటల్ డిటాక్స్' అనే భావన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. డిజిటల్ డిటాక్స్ అనగా, నిర్దిష్ట కాలపరిమితిలో డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించడం లేదా పూర్తిగా విరమించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే ప్రక్రియ.
ఇది కేవలం పరికరాల నుంచి విరామం తీసుకోవడం మాత్రమే కాదు, సమతుల్య జీవనశైలిని అలవరచుకునే సూచికగా కూడా నిలుస్తుంది. ఈ విధంగా విరామాన్ని పాటించడం వలన మనస్సు ప్రశాంతంగా మారుతుంది, ఆలోచనాశక్తి స్పష్టత పొందుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ముఖ్యమైన పనులపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలుగుతాము. నిత్యం నోటిఫికేషన్ల ఒత్తిడి నుంచి బయటపడటం వల్ల ఉత్పాదకత పెరిగి, మన సామాజిక బంధాలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపే సమయం పెరగడం వల్ల సంబంధాలు సాన్నిహిత్యంతో నిండి మానవీయత పునరుజ్జీవితమవుతుంది.
డిజిటల్ డిటాక్స్ అనేది ఈ యాంత్రిక యుగంలో మనకు శాంతియుత, సమతుల్య జీవనాన్ని అందించగల మార్గం. దీన్ని క్రమం తప్పకుండా పాటించడం ద్వారా మన ఆత్మీయ సంబంధాలు బలపడతాయి, మనస్సు ప్రశాంతమవుతుంది, జీవితాన్ని మరింత అవగాహనతో ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. ఇది ఒక జీవిత ధర్మంగా మలచుకునే అలవాటు కావాలి.
- డా. కృష్ణకుమార్ వేపకొమ్మ