అతి త్వరలో డిజిటల్​ భూసర్వే

అతి త్వరలో డిజిటల్​ భూసర్వే
  •     ఆర్ఐ, తహసీల్దార్, ఆర్డీవోలకు జాబ్​చార్ట్ 
  •     రెవెన్యూ శాఖ పేరు కూడా మారే అవకాశం ఉంది
  •    ధరణి వంద శాతం సక్సెస్​ అయిందని కితాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అతిత్వరలోనే  డిజిటల్ భూ సర్వే చేపడతామని సీఎం కేసీఆర్​ అన్నారు.  వ్యవసాయ భూములకు కో ఆర్డినేట్స్ (అక్షాంశ రేఖాంశాలు) ఇస్తామని చెప్పారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని ఆఫీసర్లను ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో ధరణి పోర్టల్ నూటికి నూరుపాళ్లు సక్సెస్​ అయిందని  చెప్పారు.  ధరణి పోర్టల్​ పనితీరుపై గురువారం ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో  ఆయన రివ్యూ చేశారు.  ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన, కొత్త పాస్​ పుస్తకాలు, ధరణి పోర్టల్ తో వ్యవసాయ భూములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని సీఎం చెప్పారు. ‘‘మిగిలిన కొద్దిపాటి సమస్యలు కూడా ప్రభుత్వం త్వరలో చేసే డిజిటల్ సర్వేతో పరిష్కారమవుతయ్.

గతంలో అసెంబ్లీలో  ప్రకటించినట్లు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే చేపడ్తం. ప్రతి భూమికి కో ఆర్డినేట్స్  ఇస్తం. నిజానికి ఇప్పటికే ఈ సర్వే ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల ఆగింది. అతి త్వరలోనే డిజిటల్ సర్వే ప్రారంభమవుతుంది” అని చెప్పారు. అటవీ-– ప్రభుత్వ భూముల మధ్య, అటవీ– -ప్రైవేటు భూముల మధ్య హద్దుల పంచాయితీ డిజిటల్​ సర్వేతో పరిష్కారమవుతుందని, పోడు భూముల సమస్య కూడా పరిష్కారమవుతుందని కేసీఆర్​ అన్నారు. మూడు, నాలుగు నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కి వస్తాయని చెప్పారు. కో ఆర్డినేట్స్ మారవు కాబట్టి భవిష్యత్తులో  హద్దుల పంచాయితీకి అవకాశం ఉండదన్నారు.  భూ రికార్డులు సక్రమంగా ఉన్న దేశాల్లో జీడీపీ 3- నుంచి 4 శాతం వృద్ధి సాధించిందని,  మన రాష్ట్రంలో కూడా అలాంటి విప్లవాత్మక మార్పునకు ప్రభుత్వం సిద్ధపడిందని సీఎం చెప్పారు.

ఆఫీసర్లకు జాబ్ చార్ట్​.. శాఖకు కొత్త పేరు..

రెవెన్యూ  ఆఫీసర్లు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్ట్ రూపొందిస్తామని  సీఎం ప్రకటించారు.  ‘‘మారిన పరిస్థితుల్లో రెవెన్యూ స్వరూపం కూడా మారింది. రెవెన్యూ శాఖ విధులు, బాధ్యతల్లో మార్పులు వచ్చాయి. గతంలో భూమి శిస్తు వసూలు చేసినప్పుడు రెవెన్యూ అనే పదం, శాఖ వచ్చాయి. ఇప్పుడు రెవెన్యూ వసూలు చేయడం లేదు. అందుకే రెవెన్యూ అనే పేరు ఇప్పుడు సరిపోదు. ఈ పేరు మారే అవకాశం ఉంది. అలాగే రెవెన్యూ శాఖ విధుల్లో మార్పులు తప్పవు. రెవెన్యూ శాఖలో ఎవరేమి పని చేయాలనే విషయంలో ప్రభుత్వం త్వరలోనే జాబ్ చార్టు రూపొందిస్తుంది. ఆర్ఐ ఏం చేయాలి? తహసీల్దార్ ఏం చేయాలి? ఆర్డీవో ఏం చేయాలి? అనే విషయాల్లో స్పష్టత ఇస్తం. రెవెన్యూ  ఆఫీసర్లను పనిచేయగలిగే, పని అవసరం ఉండే చోట ప్రభుత్వం వాడుకుంటుంది’’ అని సీఎం చెప్పారు. ఏమైనా సమస్యలు, సందేహాలుంటే  ఇకపై కలెక్టర్లకు అప్లయ్​ చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. కలెక్టర్లు ఆ అప్లికేషన్లను స్వీకరించాలని, సీఎస్​ నుంచి వచ్చే గైడ్​లైన్స్​కు తగ్గట్టు వాటిని పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.

ధరణిపై తప్పుడు స్టోరీలొస్తే కలెక్టర్లు స్పందించాలి

ధరణిపై కొన్ని పత్రికలు కావాలని తప్పుడు వార్తలు, స్టోరీలు ప్రచురిస్తున్నాయని సీఎం కామెంట్​ చేశారు. వాటిపై సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. ప్రజలకు  పూర్తి వివరాలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న పకడ్బందీ వ్యూహంతో ఎవరూ ధరణిలో వేలుపెట్టి మార్పులు చేసే అవకాశం లేదని, చివరికి సీసీఎల్ఏ, సీఎస్ కూడా రికార్డులను మార్చలేరని సీఎం అన్నారు. అంతా సిస్టమ్ డ్రివెన్(వ్యవస్థానుగత) పద్ధతిలో మనుషుల ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్  ప్రాసెస్​  జరుగుతోందని చెప్పారు.  రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని సీఎం అన్నారు. ‘‘రిజిస్ట్రేషన్ల ప్రాసెస్​ ఇంత సజావుగా సాగడం కొందరికి మింగుడు పడడం లేదు. ధరణి పోర్టల్ మీద చిలువలు, పలువలు ప్రచారం చేస్తున్నరు. అసంబద్ధమైన విషయాలు మాట్లాడుతున్నరు. లేని సమస్యలు సృష్టించి, పైరవీలు చేసి అక్రమంగా సంపాదించుకునే వారు ఇప్పుడు అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నరు. వారే అపోహలు సృష్టించి గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నరు” అని సీఎం పేర్కొన్నారు.