మరో 150 స్కూళ్లలో ట్యాబ్ పాఠాలు.. మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో అమలు

మరో 150 స్కూళ్లలో ట్యాబ్ పాఠాలు.. మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో అమలు
మెదక్, వెలుగు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో  విద్యార్థులకు ట్యాబ్ ల ద్వారా పాఠాల బోధన సత్ఫలితాలు ఇస్తోంది. దీంతో మరిన్ని స్కూళ్లకు విస్తరించాలని విద్యా శాఖ నిర్ణయించింది. సంబంధిత ట్రస్ట్ సైతం ఇందుకు ఆమోదం తెలపడంతో ఆ దిశగా కార్యాచరణ మొదలైంది. బెంగుళూర్ కు చెందిన మేఘశాల ట్రస్ట్ సహకారంతో గతేడాది మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో 100 స్కూళ్లను ఎంపిక చేసి ట్యాబ్ లను పంపిణీ చేశారు. పైలెట్ ప్రాజెక్ట్ గా మెదక్ జిల్లాలో 40, సిద్దిపేట జిల్లాలో 30, యాదాద్రి జిల్లాల్లో 30 స్కూళ్లను ఎంపిక చేశారు. 

ప్రతి స్కూల్ కు 6, 7, 8 తరగతులకు ఒకటి చొప్పున 3 ట్యాబ్స్ పంపిణీ చేశారు. సదరు ట్రస్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లను విద్యార్థులకు సులభంగా అర్థం అయ్యేలా బోధించడం కోసం ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. ఆ యాప్ ను ట్యాబ్ లలో ఇన్​స్టాల్ చేసి ఇచ్చారు. ట్యాబ్ ద్వారా ఆయా సబ్జెక్ట్ ల పాఠ్యాంశాలు బోధించడంపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. మూడు జిల్లాల్లో 100 స్కూళ్లలో చదువుతున్న 8 వేల మంది విద్యార్థులకు ట్యాబ్ ల ద్వారా పాఠాలను బోధిస్తున్నారు. 

1,500 మంది విద్యార్థులకు..

ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో మరిన్ని స్కూళ్లకు విస్తరించాలని విద్యాశాఖ, మేఘశాల ట్రస్టు నిర్ణయించాయి. మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో 150 స్కూళ్లలో ట్యాబ్ ల ద్వారా పాఠాల బోధన విధానం అమలు చేయాలని నిర్ణయించారు. మెదక్ జిల్లాలో 60 స్కూళ్లను, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి 90 స్కూళ్లను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన స్కూళ్లకు మేఘ శాల ట్రస్ట్ ద్వారా ట్యాబ్ లను పంపిణీ చేశారు. మొదటి దశలో ట్యాబ్ ల ద్వారా మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లను మాత్రమే బోధించగా ఈ సారి ఎంపిక చేసిన స్కూళ్లలో ఇంగ్లిష్ సబ్జెక్ట్ కూడా బోధించనున్నారు. అందుకు అనుగుణంగా సంబంధిత యాప్ ను అప్​డేట్​చేస్తున్నారు. రెండో దశలో మొత్తం 150 స్కూళ్లలో ట్యాబ్ ల ద్వారా పాఠాల బోధన అమలు కానుండగా సుమారు 1,500 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.