ప్రభుత్వ నియంత్రణలోకి డిజిటల్ మీడియా..?

ప్రభుత్వ నియంత్రణలోకి డిజిటల్ మీడియా..?

డిజిటల్ మీడియాకు కళ్లెం వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డిజిటల్ మీడియాను ప్రభుత్వ నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పీరియాడికల్స్ చట్టాన్ని సవరించనుంది. చట్ట సవరణ అనంతరం డిజిటల్ న్యూస్ సైట్లు సహా సంబంధిత డిజిటల్ మీడియా ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. దాని నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. అతిక్రమణకు పాల్పడితే వెబ్‌సైటు  రిజిస్ట్రేషన్ రద్దు చేయడం లేదా జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ఆఫ్ ప్రెస్ అండ్ పిరియాడికల్స్ చట్ట సవరణ ప్రక్రియను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం. 

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ నేతృత్వంలో కేంద్ర సమాచారశాఖ ఓ అప్పిలేట్ బోర్డు ఏర్పాటు యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదిత సవరణ బిల్లుకు ఇంకా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని తెలుస్తోంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే డిజిటల్ న్యూస్ సంస్థలను పర్యవేక్షించే ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ వద్ద డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 90 రోజుల వ్యవధిలో ఈ ప్రక్రియను పూర్తి  చేయాల్సి ఉంటుంది.