చిరు వ్యాపారులను దోచుకుంటున్న డిజిటల్​ పేమెంట్ ​సంస్థలు 

చిరు వ్యాపారులను దోచుకుంటున్న డిజిటల్​ పేమెంట్ ​సంస్థలు 

లెక్కలోకి రాకుండా పోతున్న డబ్బులు 
టెక్నికల్ ప్రాబ్లమ్స్​తో నష్టపోతున్న కస్టమర్లు, ఓనర్లు

విద్యానగర్​లో వారం సంతలో కూరగాయలు అమ్మే లక్ష్మమ్మ కొంత కాలంగా క్యూఆర్ కోడ్ ఆధారిత పేమెంట్​ మెషీన్ ​వాడుతుంది. కస్ట మర్లు పేమెంట్ చేశాక సక్సెస్ ఫుల్ వస్తుంది. ఓ రోజు మొత్తం లెక్క చూసుకుంటే రూ. 250 తక్కువైనవి. ఏం చేయాలో తెలియక అయోమయానికి గురైంది.’’

అమీర్​పేటలోని మైత్రీవనం కాంప్లెక్స్​లో టీ స్టాల్ నిర్వాహకుడు వెంకటేశ్ ​ఈజీ పేమెంట్ యూపీఐ వ్యాలెట్​ వినియోగిస్తుండు. కస్టమర్ల పంపిన అమౌంట్ క్రెడిట్ కాలేదు. అడిగితే  తన అకౌంట్​లో పైసలు కట్ అయ్యాయని కస్టమర్ చూపించాడు.  క్రెడిట్ కాలేదని టీ స్టాల్ నిర్వాహుకుడు వాదించగా వారి మధ్య గొడవ జరిగింది.’’ 

హైదరాబాద్, వెలుగు : టీ తాగినా... కూరగాయలు కొన్నా.. ఇలా ఏదైనా వస్తువు తీసుకుంటే ఆన్ లైన్ పేమెంట్​ మస్ట్​అయింది. అయితే డిజిటల్ పేమెంట్లతో చిరు వ్యాపారులకు ఇబ్బందులు తప్పట్లేదు. తరచుగా వచ్చే టెక్నికల్ ప్రాబ్లమ్స్​తో కస్టమర్లు, షాపు నిర్వాహకులు నష్టపోతున్నారు. రెండు నెలల నుంచి డిజిటిల్ పేమెంట్ సంస్థలు సర్వీస్ చార్జీలను అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. కస్టమర్లను పెంచుకునేందుకు  స్పెషల్ డివైజ్ లను అందిస్తూ కస్టమర్లు, షాపు ఓనర్లకు నష్టం చేస్తున్నాయి. 
బ్యాంక్ లింకేజీ, వ్యాలెట్ సేవల పేరిట ..
డిజిటల్ సేవలతో  పేమెంట్లు ఈజీగా చేసే సౌకర్యం ఉంది. తరచుగా వస్తున్న టెక్నికల్ ప్రాబ్లమ్స్​తోనే  ఇబ్బందులు తప్పట్లేదు. ఎమర్జెన్సీ సమయాల్లోనూ పేమెంట్లను నష్టపోతున్నారు. హడావుడిగా జరిపే పేమెంట్ల ట్రాన్సక్షన్లు జరగక, ఖాతా ఖాళీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిరువ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని, లావాదేవీలు పెంచుకుంటున్న కంపెనీలు, మెరుగైన సేవలను అందించట్లేదు. బ్యాంక్ లింకేజీ, వ్యాలెట్ వంటి సేవలతో షాపు నిర్వాహకులపై చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇటీవల స్పెషల్ డివైజ్ లను తీసుకువచ్చిన కొన్ని కంపెనీలు, బిల్లు చెల్లించగానే అనౌన్స్ మెంట్ చేసే స్పీకర్లను అందజేస్తున్నాయి. అయితే వచ్చిన మొత్తంలో మెయింటెనెన్స్ రూపంలో కొంత మొత్తాన్ని నెలవారీగా వసూలు చేస్తున్నాయి. 
నెలవారీ లిమిట్​దాటగానే..
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లించినా.. రిసీవర్ అకౌంట్ లో డబ్బు జమ కావట్లేదు. దీంతో పంపించిన వారు నష్టపోతుండగా, నెలవారీ లిమిట్ దాటగానే సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. డబ్బులు వస్తాయో లేదో తెలియని పరిస్థితి ఎదురైతుంది. ఇక యాప్ లకు లింకు చేసుకున్న బ్యాంకు ఖాతాలో నుంచి కొంత మొత్తం కట్ అవుతుండగా చిరు వ్యాపారులు అయోమయానికి గురవుతున్నారు.  రూ. 10 – 20 లకు కూడా డిజిటల్ పేమెంట్లు చేస్తుండగా లెక్క తప్పుతుందని, మొత్తం లెక్క చూసుకుంటే సరిపోవట్లేదని వాపోతున్నారు. 

ఫ్రీ సర్వీసులు అని చెప్పి..
కేవైసీ, డిజిటల్ డివైజ్, సర్వీసుల పేరిట కంపెనీలు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి. ముందుగా ఫ్రీ  సర్వీసులు అని చెప్పి, అకౌంట్​ఇస్తున్నాయి. ఆ తర్వాత నెలవారీ చార్జీలు వసూలు చేస్తుండగా ఐదారు నెలలుగా రూ. 350–500 చెల్లిస్తున్నారు. దీంతోపాటు డివైజ్ కు సెక్యూరిటి డిపాజిట్లు చేస్తుండగా, క్యూఆర్ కోడ్ కు ప్రత్యేక ఫీజుతో  చార్జీలు ఉండగా, నెలవారీ యూపీఐ సేవలకు బ్యాంకులు కూడా వసూలు చేస్తున్నాయి.  లక్షల్లో టర్నోవర్ ఉండే వ్యాపారులకు వీటి నిర్వహణ భారం తగ్గుతుంది. చిరు వ్యాపారులకు డిజిటల్ పేమెంట్లు అదనపు బాదుడుగా మారాయి.  ఒక్కోసారి డిజిటల్ పేమెంట్ లేదంటే వెళ్లిపోవడంతో గిరాకీ పోతుందని ఖైరతాబాద్ లోని చికెన్ సెంటర్ నిర్వాహకుడు రామకృష్ణ తెలిపాడు.