డిజిటల్​ పేమెంట్ ట్రాన్సాక్షన్లు  1,050 కోట్లు

డిజిటల్​ పేమెంట్ ట్రాన్సాక్షన్లు  1,050 కోట్లు
  •     జనవరిలో రూ. 51 లక్షల కోట్ల విలువైన డిజిటల్​ పేమెంట్లు
  •     ఇప్పుడు విదేశాలలోనూ మన యూపీఐ, రూపే నెట్​వర్క్​లు 
  •     గవర్నర్​ శక్తికాంత దాస్​ వెల్లడి

కొచ్చి: ఈ ఏడాది జనవరి  నెలలో రూ. 51 లక్షల కోట్ల విలువైన 1,50 కోట్ల డిజిటల్​ పేమెంట్​ ట్రాన్సాక్షన్లు  దేశంలో జరిగాయని, మన డిజిటల్​ పేమెంట్స్​ సిస్టమ్​ ఎంత పటిష్టంగా ఉందో ఇది తెలియచేస్తుందని రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు. పేమెంట్స్​ సిస్టమ్​లో యూనిఫైడ్​ పేమెంట్స్​ ఇంటర్​ఫేజ్​ (యూపీఐ) ఒక రివల్యూషన్​ తెచ్చిందని, జనవరి లో జరిగిన డిజిటల్‌ పేమెంట్లలో యూపీఐ ద్వారా  రూ.13 లక్షల కోట్ల విలువైన 803 కోట్ల ట్రాన్సాక్షన్లు ప్రాసెస్​ అయ్యాయని వెల్లడించారు. పేమెంట్​ సిస్టమ్ ​ ఆపరేటర్లు, ప్రభుత్వం కృషి వల్లే ఇది సాధ్యపడిందని చెబుతూ, దీని ఫలితంగా గ్లోబల్​ పేమెంట్స్​ రంగంలో రిజర్వ్​ బ్యాంక్​ స్టార్​ హోదా సంపాదించుకోలిగిందని దాస్​ పేర్కొన్నారు. పేమెంట్​ సిస్టమ్​ ఆపరేటర్ల (పీఎస్​ఓ) కాన్ఫరెన్స్​లో ఆర్​బీఐ గవర్నర్​ పాల్గొన్నారు. ఇండియాలో పేమెంట్స్​ స్వరూపమే మారిపోయిందని, అత్యాధునికంగా సాగుతోందని దాస్​ చెప్పారు. మన తాజా పేమెంట్స్​ సిస్టమ్​ అందుబాటులో ఉండటమే కాకుండా, కన్వీనియెంట్​గానూ, వేగంగానూ, భద్రంగానూ కూడా ఉందని పేర్కొన్నారు. 

డిజిటల్​తోనే ఎనీటైమ్​..ఎనీవేర్​ బ్యాంకింగ్​ 

దేశంలో సుమారు 114 కోట్ల మొబైల్​ ఫోన్​ కనెక్షన్లున్నాయని, ఇందులో 55 శాతం వాటా అర్బన్​ ఏరియాలదైతే, మిగిలిన 45 శాతం రూరల్​ ఏరియాలదని ఆర్​బీఐ గవర్నర్​ చెప్పారు. మొబైల్​ ఫోన్ల వాడకం పెరగడంతోపాటు, ఇంటర్​నెట్​ సేవలు అందుబాటులోకి రావడం  డిజిటల్​ పేమెంట్ల జోరు ఎక్కువవడానికి దారితీసిందన్నారు. బ్యాంకు బ్రాంచీల వర్కింగ్​ అవర్స్​తో సంబంధం లేకుండా ఎనీటైమ్​..ఎనీవేర్​ బ్యాంకింగ్​ సాధ్యమవుతోందని పేర్కొన్నారు.  డేటా విడుదలలో రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా ట్రాన్సపరెంట్​గా వ్యవహరిస్తోందని, ఎలాంటి చర్యలు తీసుకుంటోందనేది కూడా ఎకో సిస్టమ్​లోని వారికి తెలుస్తోందని చెప్పారు. నగదు తక్కువగా ఉండే సమాజం వైపు చురుగ్గా కదలాలనేదే దీని వెనక ఉన్న ఉద్దేశమని పేర్కొన్నారు. ఇదే టైములో పేమెంట్​ సిస్టమ్స్​ ఆరోగ్యకరంగానూ ఉండేలా చూస్తున్నామని చెప్పారు. 

కలిసి పనిచేద్దాం...పీఎస్​ఓలకు పిలుపు

రెగ్యులేటరీ వ్యవస్థ తీసుకునే చర్యలను వెంటనే పేమెంట్​సిస్టమ్​ ఆపరేటర్లు (పీఎస్​ఓ) వెంటనే అమలులోకి తేవాలని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ ఈ సందర్భంగా సూచించారు. కలిసి పనిచేద్దాం....పేమెంట్స్ ఎకోసిస్టమ్​ అందరికీ కలిసొచ్చేలా చూద్దామని పీఎస్​ఓలకు దాస్​ పిలుపునిచ్చారు. 2018 మార్చిలో తెచ్చిన డిజిటల్​ పేమెంట్​ ఇండెక్స్​ సెప్టెంబర్ 2022 నాటికి 377.46 పాయింట్లకు చేరిందని దాస్​ వెల్లడించారు. మొదలు పెట్టినప్పుడు ఈ ఇండెక్స్​ బేస్​ 100 పాయింట్లని అన్నారు. మనం చాలా దూరం ప్రయాణించామనడానికి ఈ ఇండెక్స్​ నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. డిజిటల్​ పేమెంట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు వచ్చే సమస్యలూ అలాగే పెరుగుతున్నాయని, ముఖ్యంగా సైబర్​ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, ఆపరేషనల్​ ఇష్యూస్​ ఇందులో ఉన్నాయని అన్నారు. కొత్తగా రాబోయే సవాళ్లకు ధీటైన రిస్క్​మిటిగేషన్ చర్యలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని పేమెంట్​ సిస్టమ్​ ఆపరేటర్లకు ఆయన సలహా ఇచ్చారు. మన సొంత పేమెంట్​ ప్రొడక్టులైన యూపీఐ, రూపే నెట్​వర్క్​లు ఇప్పుడు గ్లోబల్ ​లెవెల్​కు ఎదిగాయని, విదేశాలలో సైతం విస్తరిస్తున్నాయని దాస్​ పేర్కొన్నారు.