సినీ కార్మికుల సమస్యలపై కీలక ముందడుగు.. తెలంగాణ ప్రభుత్వ కమిటీతో టాలీవుడ్ ప్రముఖుల చర్చలు!

 సినీ కార్మికుల సమస్యలపై కీలక ముందడుగు.. తెలంగాణ ప్రభుత్వ కమిటీతో టాలీవుడ్ ప్రముఖుల చర్చలు!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో (టాలీవుడ్) పనిచేసే వేలాది మంది కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, భద్రత వంటి అపరిష్కృత సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ అంశాలపై చర్చించి, ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించడానికి నియమించిన ప్రత్యేక కమిటీ తొలి సమావేశం ఈ రోజు ( అక్టోబర్ 24న ) కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగింది.

ప్రభుత్వ కమిటీ తొలి భేటీ..

కార్మిక శాఖ కమిషనర్ దాన కిశోర్ గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ కమిటీలో సినీ పరిశ్రమలోని కీలక ప్రముఖులు, కార్మిక సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. హాజరైన వారిలో  కార్మిక శాఖ  కమిషనర్ దాన కిశోర్,  కార్మిక శాఖ అడిషనల్ కమిషనర్ గంగాధర్ , ఎఫ్.డి.సి చైర్మన్ & ప్రముఖ నిర్మాత దిల్ రాజు, నిర్మాత, యార్లగడ్డ సుప్రియ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు  అనిల్ కుమార్ వల్లభనేని , తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు కనుమిల్లి ఉన్నారు.  ఈ సమావేశంలో సినీ కార్మికుల సమస్యలపై ప్రధానం గా చర్చించారు.

చర్చనీయాంశాలు..

 వేతనాల పెంపు కోసం రెండు నెలల క్రితం సినీ కార్మికులు దాదాపు 18 రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఆ సమ్మె కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయి పరిశ్రమకు పెద్ద నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో, కార్మికులకు దశలవారీగా 22.5% వేతనాలు పెంచడానికి నిర్మాతలు అంగీకరించారు. ఈ ఒప్పందం తాత్కాలిక పరిష్కారాన్ని ఇచ్చినా, దీర్ఘకాలిక సమస్యలైన పనివేళలు, బీమా, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించేందుకు ఈ కమిటీ కృషి చేయనుంది.

కమిటీ తొలి సమావేశంలో, ప్రధానంగా కార్మికుల జీతాల సవరణ, వారి సంక్షేమ పథకాలు, సినీ పరిశ్రమలో పారదర్శకత పెంచడంపై వంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. వచ్చే వారం ప్రస్తుతం చర్చకు వచ్చిన సమస్యలపై చర్చించి పరిష్కరించుకుంటామని దిల్ దాజు తెలిపారు.  త్వరలోనే సమగ్ర వేదికను ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కమిటీ సిఫార్సులు టాలీవుడ్‌లో కార్మికులకు మెరుగైన భవిష్యత్తును అందిస్తాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.