పాత రేట్లకే ‘ఎఫ్3’ చూడొచ్చు!

పాత రేట్లకే ‘ఎఫ్3’ చూడొచ్చు!

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్‌‌3’ ఈ నెల 27న రిలీజవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు కాసేపు ఇలా కబుర్లు చెప్పారు.

  • ‘సరిలేరు నీకెవ్వరు’ తీసిన తర్వాత ‘ఎఫ్‌‌3’ స్క్రిప్ట్ రెడీ చేశాడు అనిల్. నాన్‌‌స్టాప్ ఎంటర్‌‌‌‌టైనర్. ‘ఎఫ్‌2’లో రిలేషన్‌‌షిప్స్‌‌లోని ఫ్రస్ట్రేషన్ చూపిస్తే, ఇందులో ఫైనాన్స్‌‌ని మెయిన్‌‌ థీమ్‌‌గా తీసుకున్నాం. పంచభూతాలతో పాటు డబ్బు  ఆరో భూతంగా చేరిందనేది కథ. 
  • అనిల్ కథ కంటే కథనానికే ప్రాధాన్యత ఇస్తాడు. బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తాడు. ఫైనల్ అవుట్‌‌పుట్ చూశాక కడుపుబ్బ నవ్వాను. హిలేరియస్ ఫన్ క్రియేట్ చేశాడు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్ రైడ్‌‌లా ఉంటుంది. 
  • వెంకటేష్ ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన హీరో. నిర్మాత గురించే ఎక్కువ ఆలోచిస్తారు. లొకేషన్‌‌లో ఏదైనా వృథా అవుతుంటే తట్టుకోలేరు. రామానాయుడు గారు నేర్పించిన గొప్ప లక్షణమది. ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుంటుంది. మిగతావాళ్లు కూడా చాలా టాలెంటెడ్. బెస్ట్‌‌ టీమ్‌‌ కుదిరింది. 
  •   ప్యాన్ ఇండియా రిలీజ్‌‌కి ఎందుకెళ్లలేదని కొందరు అడుగుతున్నారు. అలా రిలీజ్ చేయాలంటే హోమ్‌‌వర్క్ చేయాలి. బాలీవుడ్‌‌ ప్రేక్షకుడు కూడా థియేటర్‌‌‌‌కి రావాలంటే స్క్రిప్ట్ దశ నుండే ప్లాన్ చేయాలి.  మాకలాంటి ఆలోచన లేదు. దీని తర్వాత ‘ఎఫ్‌‌ 4’ కూడా ఉంటుంది. ఆల్రెడీ అనిల్ మంచి ఐడియా చెప్పాడు. 
  • ప్యాండమిక్ తర్వాత పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. సినిమాలు ఆగిపోయి బడ్జెట్స్‌‌ పెరిగాయి. ఆడియెన్స్ ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడ్డానికి అల వాటు పడ్డారు. అందుకే ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు రేట్లు పెంచి  రికవర్ చేయడానికి ప్రయత్నించాం. మంచి ఫలితాలు సాధించాం. అయితే రిపీట్ ఆడియెన్స్ తగ్గిపోయారు. అప్పర్ క్లాస్ ఓకే కానీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఆడియెన్స్ థియేటర్‌‌‌‌కి రావట్లేదు. టికెట్ల ధరలు అందుబాటులో లేకపోవడమే కారణం. ‘ఎఫ్3’ ఫ్యామిలీ సినిమా కాబట్టి పాత జీవో ప్రకారం రేట్లు తగ్గించాం. 
  • నైజాంలో దిల్‌‌రాజు రిలీజ్ చేశాడు కాబట్టి ఆయనే రేట్లు పెంచాడని  అనేస్తారు. కానీ తెర వెనుక బోలెడంత కథ ఉంటుంది. నైజాంలో నాలుగొందల యాభై థియేటర్లు ఉంటే అందులో మావి అరవై. వాటితో నేను అందరినీ కంట్రోల్ చేసేయడం ఉండదు. ఎవరైనా రూపాయి అడ్వాన్స్‌‌గా ఇస్తే సినిమా అయిపోగానే రెండు మూడు వారాల్లో తమ ఖాతా సెటిల్ చేసుకుని వెళ్లిపోతారు. మాకిచ్చిన డబ్బు అంత సేఫ్‌‌గా వుంటుంది. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల మాకు ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల మేము నెంబర్ వన్‌‌గా వున్నాం తప్పితే అందరినీ కంట్రోల్ చేసేసి కాదు. 
  • సినిమా మారుతోంది. మార్వెల్, అవతార్ లాంటి లార్జర్‌‌‌‌ దేన్ లైఫ్‌‌ సినిమాలే నిలబడుతున్నాయి. బాహుబలి, ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌తో తెలుగులోనూ ఈ ట్రెండుకి శ్రీకారం చుట్టారు రాజమౌళి. మేమూ రెండేళ్లలో ఒకట్రెండు పెద్ద సినిమాల్ని ప్రకటించే అవకాశం వుంది.