ZIM vs SL: జింబాబ్వేపై చివరి ఓవర్‌లో 10 పరుగులు.. హ్యాట్రిక్‌తో ఓడిపోయే మ్యాచ్ గెలిపించిన లంక పేసర్

ZIM vs SL: జింబాబ్వేపై చివరి ఓవర్‌లో 10 పరుగులు.. హ్యాట్రిక్‌తో ఓడిపోయే మ్యాచ్ గెలిపించిన లంక పేసర్

శ్రీలంక, జింబాబ్వే జట్ల మధ్య శుక్రవారం (ఆగస్టు 29) హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో తొలి వన్దే. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 298 పరుగుల భారీ స్కోర్. లంక బౌలింగ్ ధాటికి లక్ష్య ఛేదనలో పసికూన చిత్తవ్వడం గ్యారంటీ అనుకున్నారు. అందుకు తగ్గట్టు ఆతిధ్య జింబాబ్వే 161 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మ్యాచ్ మీద ఆశలు వేదిలేసుకుంది. ఈ దశలో కెప్టెన్ సికిందర్ రజా (92), టోనీ మున్యోంగా (43) 128 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. చివరి ఓవర్లో పది పరుగులు చేసి సంచలన విజయం అందుకోవడానికి జింబాబ్వే సిద్ధంగా ఉంది. 

మ్యాచ్ విన్నర్ రజా ఉండడంతో ఆతిధ్య జట్టు విజయంపై ధీమాగా కనిపించింది. ఈ దశలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మధుశంక అద్భుతం చేశాడు. హ్యాట్రిక్ తీయడంతో పాటు ఈ ఓవర్ లో కేవలం రెండు  పరుగులు మాత్రమే ఇచ్చి లంక జట్టుకు 7 పరుగుల విజయాన్ని అందించాడు. రజా, బ్రాడ్ ఎవాన్స్, న్గరవ లను తొలి బంతులకు ఔట్ చేసి హ్యాట్రిక్ ను తన ఖాతాలో వేసికొని మ్యాచ్ ను టర్న్ చేశాడు. చివరి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వడంతో లంక జట్టు తృటిలో పసికూన నుంచి ఓడిపోయే ప్రమాదాన్ని తప్పించుకుంది. 

ఈ మ్యాచ్ గెలవడంతో మూడు వన్డేల సిరీస్ లో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ పాతుమ్ నిశాంక (76), లియాంగే (70), కామిందు మెండీస్ (57) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 291 పరుగులకు పరిమితమైంది. బెన్ కరణ్ 70 పరుగులు చేసి టాపార్డర్ లో రాణించగా.. సికిందర్ రజా 92 పరుగులతో అసాధారణంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. మధుశంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.