
శ్రీలంక టెస్టు జట్టు కెప్టెన్ కరుణరత్నే కీలక నిర్ణయం తీసుకున్నాడు. న్యూజిలాండ్ తో 2–0తో సిరీస్ కొల్పోయిన తరుణంలో వచ్చే నెలలో జరగనున్న ఐర్లాండ్ టెస్టు సిరీస్ తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లుగా ప్రకటించాడు. ఇదే విషయాన్ని లంక బోర్డుకు తెలిపినట్లుగా కరుణరత్నే వెల్లడించాడు. అయితే అతని నిర్ణయం పట్ల లంక సెలెక్టర్లు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
2019లోది నేష్ చండిమాల్ స్థానంలో తొలిసారి శ్రీలంక టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన కరుణరత్నే.. కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో సౌతాఫ్రికాపై చారిత్రక సిరీస్ సాధించాడు. మొత్తం 26 టెస్టులకు కెప్టెన్ గా వ్యవహరించిన కరుణరత్నే అందులో లంక జట్టుకు 10 విజయాలను, 7 డ్రాలు, 9 పరాజయాలను అందించాడు. ఇక ఇప్పటివరకు 84 టెస్టు మ్యాచ్ లు ఆడిన అతను 39.94 సగటుతో ఓ డబుల్ సెంచరీ, 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీల సాయంతో 6230 పరుగులు చేశాడు.
ఇక న్యూజిలాండ్ తో మ్యాచ్ విషయానికి వస్తే రెండో టెస్టు మ్యాచ్ లో శ్రీలంక 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.